మరో భారత్‌ జోడో యాత్రకు కాంగ్రెస్‌ సన్నాహాలు

Rahul Gandhi Aide Said Cant Have Alliance In Kerala Or Telangana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల్లో భారీ విజయం సాధించి మంచి జోరుమీద ఉన్న కాంగ్రెస్‌ అదే ఊపును జాతీయ ఎన్నికల్లో కొనసాగించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ మరో భారత్‌ జోడో యాత్రకు కూడా ప్లాన్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో భారీ విజయాన్ని అందుకున్న కాంగ్రెస్‌ అక్కడ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై గట్టిగా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఈ ఫలితాలు ప్రతిపక్ష ఐక్యతకు సందేశం మాత్రమే గాక జాతీయ స్థాయిలో మనం కలిసి పనిచేయాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోందన్నారు.

అయితే కొన్ని రాష్ట్రాలతో సైద్ధాంతిక విభేదాలతో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఇతర ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అయితే తాము కేరళలో సీపీఎంతో లేదా తెలంగాణ బీఆర్‌ఎస్‌తో పొత్తులు పెట్టుకోలేమని తేల్చి చెప్పారు. అయితే ఈ పొత్తు ఎన్నికల తర్వాత లేదా ఒక్కోసారి ముందస్తుగా కూడా ఉండొచ్చన్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గేను ఆ పదవిని చేపట్టే అవకాశం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. దీని గురించి ఖర్గేని ప్రశ్నించకండి, పుకార్లను నమ్మవద్దని అన్నారు.

రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌ నాయకుల మధ్య రగులుతున్న వివాదాన్ని సైతం క్రమబద్ధీకరిస్తాం అని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో ఇదే జోరుని కొనసాగించేలా దేశవ్యాప్తంగా మరో ప్రచారానికి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. తాము ఈసారి తూర్పు నుంచి పడమర వరకు పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. గతేడాది కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో కాంగ్రెస్‌ భారీ విజయాన్ని సాధించి, బీజేపీని సునాయాసంగా మట్టికరిపించిందన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అతని పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను రూపొందించేలా ఈ ఫలితం ప్రతిపక్ష కూటమి ఓ కొత్త  ఊపునిచ్చిందని వేణుగోపాల్‌ అన్నారు. 

(చదవండి: నెక్స్ట్‌ ప్రధాని రాహుల్‌! దాన్ని ప్రజలే నిర్ణయిస్తారు: ప్రియాంక గాంధీ)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top