భార్య ఉందని హత్య ఆలస్యం.. మసూద్‌ మర్డర్‌కు ప్రతీకారంగానే?

Praveen Murder Case: 3 Prime Accused Arrested karnataka Kerala Border - Sakshi

సాక్షి, కర్ణాటక: దక్షిణ కన్నడ జిల్లా బెళ్లారెలో బీజేపీ నేత ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసులో కేరళలో తలదాచుకున్న ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఏడీజీపీ అలోక్‌కుమార్‌ తెలిపారు. గురువారం మంగళూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రవీణ్‌ హత్య తరువాత  నిందితులు శియాబుద్దీన్, రియాజ్, బషీర్‌లు కేరళకు పరారయ్యారని, తలపాడి చెక్‌పోస్టు వద్ద అరెస్టు చేశామని చెప్పారు. వీరికి ఆశ్రయమిచ్చిన వారిని కూడా విచారిస్తున్నాం. ఎందుకు హత్య చేశారు అనేదానిపై కూలంకషంగా విచారణ చేస్తున్నాం. హంతకులతో కలిసి శియాబుద్దీన్‌ పథకం పన్నారు. ప్రవీణ్‌ ప్రతి రోజూ భార్యతో షాపునకు వచ్చి వెళ్తుండడంతో హత్యను వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు జూలై 26వ తేదీ రాత్రి ప్రవీణ్‌ ఒక్కడే షాపు నుంచి రావడం చూసి దాడి చేశారు.  

మసూద్‌ హత్యకు ప్రతీకారం?  
మసూద్‌ అనే వ్యక్తి హత్యకు ప్రతీకారంగా ప్రవీణ్‌ను చంపారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఏడీజీపీ తెలిపారు. ప్రవీణ్‌ కేసులో ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. జూలై 19వ తేదీన బెళ్లారెలో మసూద్‌ అనే వ్యక్తిపై కొందరు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మంగళూరులో చికిత్స పొందుతూ రెండురోజుల తరువాత మృతి చెందాడు. ఇందుకు బదులుగా ప్రవీణ్‌పై దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.  

ప్రవీణ్‌ హత్యకు ముందే కేరళలో ఎక్కడ తలదాచుకోవాలా అని హంతకులు ప్లాన్‌ సిద్ధం చేశారు. 15 రోజుల్లో ఏడు చోట్ల హంతకులు ఆశ్రయం పొందారు. దీంతో పోలీసులు నిందితుల కుటుంబసభ్యులు, ఆత్మీయులను తీవ్ర విచారణ చేపట్టారు. రకరకాల రీతిలో ఒత్తిడి పెంచడంతో కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు నిందితులు బయటకు వచ్చారు. ఈ కేసును ఎన్‌ఐఏ కూడా విచారిస్తోంది.

చదవండి: (బీజేపీ నేత దారుణ హత్య.. అక్కడి నుంచే ప్లాన్‌ జరిగింది!) 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top