‘అది నా మనస్సాక్షికి విరుద్ధం’ | Prashant Bhushan Has Refused To Retract Or Apologise On His Twets | Sakshi
Sakshi News home page

క్షమాపణలు చెప్పేందుకు ప్రశాంత్‌ భూషణ్‌ నిరాకరణ

Aug 24 2020 3:49 PM | Updated on Aug 24 2020 3:57 PM

Prashant Bhushan Has Refused To Retract Or Apologise On His Twets - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, సుప్రీంకోర్టులపై తాను చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పేందుకు ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ నిరాకరించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ప్రశాంత్‌ భూషణ్‌ మూడు రోజుల్లోగా తన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని కోర్టు ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. అయితే తాను పూర్తి విశ్వాసంతో ఈ ట్వీట్లు చేశానని, దీనిపై షరతులతో లేదా బేషరుతగా క్షమాపణలు చెప్పడం సరైంది కాదని ప్రశాంత్‌ భూషణ్‌ సర్వోన్నత న్యాయస్ధానానికి స్పష్టం చేశారు. అది తన మనస్సాక్షికి విరుద్ధమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యలపై గురువారం విచారించిన సుప్రీంకోర్టు ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలని, తన ప్రకటనపై మూడు రోజుల్లోగా పున:పరిశీలించాలని కోర్టు కోరింది. ‘మీరు వందలకొద్దీ మంచి పనులు చేయవచ్చు..కానీ అది మీరు పది నేరాలు చేసేందుకు లైసెన్స్‌ ఇవ్వబోద’ని ఈ సందర్భంగా జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా ప్రశాంత్‌ భూషణ్‌ను ఉద్దేశించి అన్నారు.

దీనిపై తాను తన న్యాయవాదిని సంప్రదిస్తానని, తన వైఖరిలో మాత్రం పెద్దగా మార్పును ఆశించరాదని ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టుకు నివేదించారు.తాను పూర్తి వివరాలతో సత్యాన్ని ఉటంకిస్తూ ఆ ప్రకటనలు చేశానని, వీటిని కోర్టులు పరిగణించలేవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, విలువల పరిరక్షణకు బహిరంగ విమర్శలు కీలకమని ఈ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలోనే తాను ఆ ట్వీటుల​ చేశానని చెప్పుకొచ్చారు. కాగా గత నెలలో నాగపూర్‌లో ప్రధాన న్యాయమూర్తి హ్యార్లీ డేవిడ్సన్‌ హెల్మెట్‌, ముఖానికి మాస్క్‌ లేకుండా బైక్‌పై ప్రయాణిస్తున్న ఫోటోను ఉద్దేశించి ప్రశాంత్‌ భూషణ్‌ ట్వీట్‌ చేశారు. కోర్టు లాక్‌డౌన్‌లో ఉండగా, ప్రజలు న్యాయం పొందే హక్కును నిరాకరిస్తూ ప్రధాన న్యాయమూర్తి బైక్‌ రైడింగ్‌ చేయడాన్ని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇక మరో​ ట్వీట్‌లో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడంలో నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల పాత్ర ఉందని ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపించారు. ఇక ప్రధాన న్యాయమూర్తిని విమర్శిస్తే న్యాయస్ధానం అధికారాన్ని తక్కువ చేయడం కాదని ఆయన కోర్టుకు తన వాదనలు వినిపించారు. చదవండి : నటి స్వర భాస్కర్‌కు ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement