యూపీలో నలుగురు పీఎఫ్‌ఐ సభ్యులు అరెస్ట్‌

UP Police Arrested Kerala Journalist Three People Over PFI Links - Sakshi

లక్నో: నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)​తో సంబంధాలు ఉన్నాయని ఒక కేరళ జర్నలిస్టు, ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గతంలో యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పీఎఫ్‌ఐని నిషేధించిన నేపథ్యంలో‌ వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన దళిత బాలిక హత్యాచార ఘటన నేపథ్యంలో ఢిల్లీ నుంచి హాథ్రాస్‌కు కారులో వెళ్తున్న ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని జర్నలిస్ట్‌ సిద్దిక్ కప్పన్,అతిక్ ఉర్ రెహ్మాన్, మసూద్ అహ్మద్, ఆలంగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుత సమయంలో యూపీలో శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు వీరిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. చదవండి: (హథ్రాస్‌ ఘటన.. రూ.50 లక్షలు ఇస్తామన్నారట!)

అదే విధంగా వారికి పీఎఫ్‌ఐ అనుబంధ సంస్థ అయిన క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా( సీఎఫ్‌) కూడా సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ హాథ్రస్‌‌ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని కవర్ చేయడానికి  ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లారని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన నిరసనలకు పీఎఫ్‌ఐకి సంబంధాలున్నాయని యూపీ ప్రభుత్వం పీఎఫ్‌ఐని నిషేధించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top