
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాను ఏమాత్రం నిలువరించట్లేదని ఆరోపిస్తూ భారత్‌పై పన్నుల మోత మోగించిన ట్రంప్ సర్కార్ విధించిన ఆగస్ట్ 27 గడువు ముగుస్తుండటంతో ప్రధానమంత్రి కార్యాలయం నేడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రధానమంత్రి ప్రధానకార్యదర్శి సారథ్యంలో ఈ సమీక్ష సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్‌పై అమెరికా ప్రభుత్వం తాజాగా విధించిన 50 శాతం దిగుమతి టారిఫ్ ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమల్లోకిరానుంది.
ఈ నేపథ్యంలో ఆయా ఎగుమతి సంస్థల లాభాల్లో కోత పడడం, ఆక్వారంగం, లెదర్, వజ్రాభరణాల ఉత్పత్తుల ఎగుమతిపై టారిఫ్ ప్రతికూల ప్రభావం వంటి కీలక అంశాలపై ఆయా రంగాల ప్రతినిధులు, సంస్థలతో ప్రధాని కార్యాలయం సమాలోచనలు జరపనుందని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతిచేసే సంస్థలతో, ఎగుమతి రంగ నిపుణులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సంప్రదింపులు మొదలెట్టింది. అమల్లోకి వచ్చిన 25 శాతం టారిఫ్ కారణంగా తమ లాభాలు పూర్తిగా తగ్గిపోయాయని, నష్టభయాలను ఎదుర్కొంటున్నామని పలువురు కేంద్ర మంత్రిత్వశాఖ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది.
50 శాతం టారిఫ్ అమల్లోకి రావడంతో తక్షణం ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే వర్గాలను ఆదుకోవాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఎగుమతిదారులు మాత్రం అత్యయిక రుణపరపతి పథకం ద్వారా మూలధనాన్ని అందించాలని, తద్వారా తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపినట్లు తెలుస్తోంది. అయితే రంగాలవారీగా ఆదుకుంటేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.