నీటి సంరక్షణ అందరి బాధ్యత

PM Narendra Modi Stresses on Water Conservation in Mann Ki Baat - Sakshi

‘‘క్యాచ్‌ ది రెయిన్‌ ’’ 100 రోజుల ప్రచారం 

మన్‌కీ బాత్‌లో పిలుపునిచ్చిన ప్రధానమంత్రి మోదీ

న్యూఢిల్లీ: దేశంలో నీటి సంరక్షణ అందరి బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రుతుపవనాలు ప్రవేశించడానికి ముందే చెరువులు, కాల్వలు, సరస్సుల్లో పూడికలు తీసి ప్రతీ వాన చినుకుని సంరక్షించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని వాన చినుకులు ఎప్పుడు పడినా, ఎక్కడ పడినా బొట్టు బొట్టు ఒడిసిపట్టి సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం చెరువులు, కాల్వలు నిర్వహణపై కేంద్ర జల మంత్రిత్వ శాఖ క్యాచ్‌ ది రెయిన్‌ అనే 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.  ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన బబితా రాజ్‌పుట్‌ నీటి సంరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని అభినందించారు. తమ గ్రామంలో ఎండిపోయిన చెరువులకి జలకళ తీసుకువస్తున్న ఆమె కృషి అందరికీ ఆదర్శమన్నారు.  

తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది  
ప్రపంచంలోనే అత్యంత పురాతమైన భాషల్లో ఒకటైన తమిళం నేర్చుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉందని ప్రధాని∙మోదీ అన్నారు. తమిళం చాలా అందమైన భాషని, సుసంపన్నమైన సాహి త్యం ఉన్న ఆ భాషని నేర్చుకోలేకపోవడం లోటుగా ఉంటుందని చెప్పారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు అపర్ణ రెడ్డిజీ  అడిగిన ఓ చ్రిన్న ప్రశ్న అయినప్పటికీ తనని వెంటాడిందని అన్నారు. ‘‘మీరు చాలా ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానిగా కూడా ఉన్నారు. జీవితంలో ఏదైనా మిస్‌ అయ్యారా’’అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టమైందన్నారు. ఆ తర్వా త ఆలోచిస్తే తమిళ భాషని నేర్చుకోవడం మిస్‌ అయినట్టుగా అనిపించిందని ప్రధాని వివరించారు.

పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి ప్రస్తావన
ఈ సందర్భంగా ప్రధాని హైదరాబాద్‌ రైతు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. వెంకటరెడ్డి లాంటి వ్యక్తుల నుంచి స్ఫూర్తిని పొందాలని సూచించారు.  డి–విటమిన్‌ అధికంగా ఉండే వరి, గోధుమ రకాలను వెంకటరెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థ నుంచి పేటెంట్‌ కూడా పొందారని తెలిపారు. ఆయనను గత ఏడాది పద్మశ్రీతో గౌరవించుకోవడం గర్వకారణమన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top