
మన దేశంలో తయారైన ఉత్పత్తులే వాడుకోవాలి
స్థానిక వస్తువులను ప్రోత్సహించాలి
దుకాణాలు, మార్కెట్లలో స్వదేశీ వస్తువులే విక్రయించాలి
మన ఆర్థిక ప్రయోజనాలు, ప్రాధాన్యతల పట్ల అప్రమత్తంగా ఉండాలి
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
వారణాసి నియోజకవర్గంలో ప్రధాని పర్యటన
రైతుల ఖాతాల్లో పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి సొమ్ము జమ
వారణాసి: స్వదేశీ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో మన దేశంలో తయారైన ఉత్పత్తులే ఉపయోగిద్దామని, స్వదేశీ విప్లవం ప్రారంభిద్దామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయడం, ప్రోత్సహించడం అసలైన దేశ సేవ అవుతుందని ఉద్ఘాటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధించడంతో, భారత ఆర్థిక వ్యవస్థ మృతప్రాయంగా మారిందంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో స్వదేశీ వస్తువుల ప్రాధాన్యతను ప్రధాని మోదీ ప్రత్యేకంగా చాటిచెప్పడం గమనార్హం. మోదీ శనివారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. రూ.2,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అలాగే పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద 9.70 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,500 కోట్లు జమ చేశారు.
అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచమంతటా ఆర్థిక పరిస్థితులు, దేశాల వైఖరి ఎలా ఉందో అందరూ తెలుసుకోవాలని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశి్చతి, అస్థిరతను ఎదర్కొంటోందని అన్నారు. అందుకే విదేశాలు సొంత ప్రయోజనాలపైనే దృష్టి పెడుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ క్రమంలో మన ఆర్థిక ప్రయోజనాలు, ప్రాధాన్యతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
పౌరులకు బాధ్యతలుంటాయి
‘‘రైతులకు, చిన్న పరిశ్రమలకు మేలు చేయడానికి, యువతకు ఉపాధి కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ విషయంలో చేయగలిగినదంతా చేస్తున్నాం. పౌరులుగా మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడాన్ని జాతీయ ఉద్యమంగా మార్చేద్దాం. మోదీ చెప్పారని కాదు. ఇది ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత. మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు స్వప్రయోజనాలు పక్కనపెట్టి దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలి.
ప్రజల్లో స్వదేశీ స్ఫూర్తిని మేల్కొల్పాలి. ప్రజలు తెలివైన వినియోగదారులుగా మారాలి. మనం ఏది కొనుగోలు చేసినా అది మన దేశంలోనే తయారైందా? అని ప్రశ్నించుకోవాలి. తోటి పౌరుల స్వేదం, నైపుణ్యంతో తయారైన వస్తువులు వాడుకోవాలి. ఇకపై మన మంత్రం ‘వోకల్ ఫర్ లోకల్’. దుకాణాలు, మార్కెట్లలో స్వదేశీ వస్తువులే విక్రయిస్తామని వ్యాపారులు, దుకాణదారులు ప్రతిజ్ఞ చేయాలి. దేశానికి సేవ చేయాలనుకుంటే ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రోత్సహించండి.
సిందూరాన్ని అవమానిస్తున్నారు
మన శక్తి సామర్థ్యాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చాయి. భారత్‌పై దాడికి దిగే ధైర్యం చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, పాతాళ లోకంలో దాక్కున్నా వెతికి మరీ అంతం చేస్తామని తెలియజెప్పాం. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు. మహాశివుడి రుద్ర రూపమే ఆపరేషన్ సిందూర్. మన సైనిక దళాల సాహసాన్ని కాంగ్రెస్ పార్టీ పదేపదే కించపరుస్తోంది. ఆపరేషన్ సిందూర్‌ను తమాషా అంటూ హేళన చేస్తోంది.
మన సోదరీమణులు ధరించే పవిత్ర సిందూరాన్ని అవమానిస్తోంది. పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. నా మనసు ఆవేదనతో నిండిపోయింది. ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటామని సిందూరం కోల్పోయిన మన బిడ్డలకు హామీ ఇచ్చా. మహాదేవుడి ఆశీస్సులతో అది నెరవేర్చా. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పరమశివుడి పాదాలకు అంకితం ఇస్తున్నా. 140 కోట్ల మంది భారతీయుల ఐక్యతే ఆపరేషన్ సిందూర్‌కు బలంగా మారింది. శివ అంటే అర్థం మంచి. కానీ, ఉగ్రవాదం, అన్యాయం తల ఎగరేసినప్పుడు శివుడు రుద్రరూపం దాలుస్తాడు.’ అని మోదీ అన్నారు.
స్వదేశంలోనే పెళ్లి చేసుకోండి
వివాహాల సీజన్ మొదలైంది. పండుగలు రాబోతున్నాయి. ప్రజలు కొత్తగా కొనే వస్తువులు, ఉత్పత్తులు మన దేశంలో తయారైనవే కావాలి. సంపన్నులు విదేశాల్లో వివాహాలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారు వివాహ వేదికను మన దేశానికి మార్చుకోవాలి. గతంలోనూ ఇలాంటి పిలుపు ఇచ్చా. ఎంతమంది స్పందించారో తెలియదు. మన ప్రతి అడుగులో స్వదేశీ అనే భావన ఉంటే అది మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మహాత్మా గాందీకి మనం ఇచ్చే అసలైన నివాళి ఏమిటో తెలుసా?.. స్థానిక ఉత్పత్తులు వాడుకోవడమే. సమ్మిళిత ప్రయత్నం, కృషి ద్వారానే మన దేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోగలం.
పాక్ నష్టపోతే ప్రతిపక్షాలకు ఏడుపెందుకో?
‘ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రజలు పండుగలా భావిస్తున్న సమయంలో మన దేశంలోనే కొందరు వ్యక్తులు అది తట్టుకోలేకపోయారు. కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేయడాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు జీరి్ణంచుకోలేపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోని పలు వైమానిక స్థావరాలు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయి. ఇండియా దాడుల్లో నష్టపోయినందుకు పాకిస్తాన్ ఏడుస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. మరి మన దేశంలోని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు వచ్చిన బాధేమిటో అర్థం కావడం లేదు.
పాకిస్తాన్‌కు నష్టం జరగడం చూసి ఆ పార్టీల నాయకులు భరించలేకపోతున్నారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్‌లో మట్టుబెట్టాం. ఈ ఆపరేషన్ ఇప్పుడే ఎందుకు చేపట్టారని సమాజ్‌వాదీ పార్టీ నేతలు ప్రశి్నస్తున్నారు. అంటే ఉగ్రవాదులు పారిపోయేదాకా ఆగాలా? మిమ్మల్ని ఇప్పుడు చంపాలా? లేక తర్వాత చంపాలా? అని ఉగ్రవాదులను అడగాలా? ఇదే సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు క్లీన్‌చిట్ ఇచ్చారు. బాంబు పేలుళ్లకు పాల్పడిన వారిపై కేసులు ఎత్తేశారు. ఇప్పుడు ఉగ్రవాదులు హతమైపోతుండడం చూసి ఆ నాయకులకు నిద్రపట్టడం లేదు.’ అని మోదీ ఎద్దేవా చేశారు.
మన క్షిపణులతో శత్రువుల్లో భయం
ఇది నవ భారతం. మహా శివుడిని అరాధిస్తున్నాం. అదే శివుడు అవసరమైనప్పుడు శత్రువులను చీల్చి చెండాడడానికి కాలభైరవుడు అవుతాడు. మన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న క్షిపణులు, డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థల శక్తి ఏమిటో ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపితమైంది. మన బ్రహ్మోస్ క్షిపణులు శత్రువుల్లో భయం పుట్టించాయి. పాకిస్తాన్‌లోని దుష్టులు వారి కలలోనూ ప్రశాంతంగా నిద్రపోలేరు. పాకిస్తాన్ కనుక మన దేశంపై మళ్లీ దాడికి దిగితే.. ఉత్తరప్రదేశ్‌లో తయారవుతున్న క్షిపణులతో పాక్ ఉగ్రవాదులను ఖతం చేస్తాం’’ అని ప్రధాని మోదీ ప్రతిన బూనారు.
మోదీకి శివలింగం బహూకరణ
ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం ఇది 51వ సారి కావడం విశేషం. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రికి చేతితో తయారు చేసిన శివలింగాన్ని బహూకరించారు. 18 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్న ఈ శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముగ్గురు బనారస్ కళాకారులు తయారు చేశారు.
మూడు భౌగోళిక సూచిక(జీఐ) సర్టీఫికెట్లు పొందిన మూడు హస్తకళల సమ్మేళనమే ఈ శివలింగం. మన స్వదేశీ హస్త కళాకృతులు, వ్రస్తాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కళాకారులకు, చేనేత కారి్మకులకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా సూచించారు. ‘లోకల్ టు గ్లోబల్’ మన లక్ష్యం కావాలన్నారు. జీఐ గుర్తింపు లభించిన స్థానిక ఉత్పత్తులను పరిరక్షించుకోవాలని, వాటిని మరింత ప్రోత్సహించాలని కోరారు.