breaking news
Swadeshi Technology
-
‘స్వదేశీ’ విప్లవం ప్రారంభిద్దాం: ప్రధాని మోదీ
వారణాసి: స్వదేశీ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో మన దేశంలో తయారైన ఉత్పత్తులే ఉపయోగిద్దామని, స్వదేశీ విప్లవం ప్రారంభిద్దామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయడం, ప్రోత్సహించడం అసలైన దేశ సేవ అవుతుందని ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధించడంతో, భారత ఆర్థిక వ్యవస్థ మృతప్రాయంగా మారిందంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో స్వదేశీ వస్తువుల ప్రాధాన్యతను ప్రధాని మోదీ ప్రత్యేకంగా చాటిచెప్పడం గమనార్హం. మోదీ శనివారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. రూ.2,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అలాగే పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద 9.70 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,500 కోట్లు జమ చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచమంతటా ఆర్థిక పరిస్థితులు, దేశాల వైఖరి ఎలా ఉందో అందరూ తెలుసుకోవాలని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశి్చతి, అస్థిరతను ఎదర్కొంటోందని అన్నారు. అందుకే విదేశాలు సొంత ప్రయోజనాలపైనే దృష్టి పెడుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ క్రమంలో మన ఆర్థిక ప్రయోజనాలు, ప్రాధాన్యతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... పౌరులకు బాధ్యతలుంటాయి ‘‘రైతులకు, చిన్న పరిశ్రమలకు మేలు చేయడానికి, యువతకు ఉపాధి కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ విషయంలో చేయగలిగినదంతా చేస్తున్నాం. పౌరులుగా మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడాన్ని జాతీయ ఉద్యమంగా మార్చేద్దాం. మోదీ చెప్పారని కాదు. ఇది ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత. మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు స్వప్రయోజనాలు పక్కనపెట్టి దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలి. ప్రజల్లో స్వదేశీ స్ఫూర్తిని మేల్కొల్పాలి. ప్రజలు తెలివైన వినియోగదారులుగా మారాలి. మనం ఏది కొనుగోలు చేసినా అది మన దేశంలోనే తయారైందా? అని ప్రశ్నించుకోవాలి. తోటి పౌరుల స్వేదం, నైపుణ్యంతో తయారైన వస్తువులు వాడుకోవాలి. ఇకపై మన మంత్రం ‘వోకల్ ఫర్ లోకల్’. దుకాణాలు, మార్కెట్లలో స్వదేశీ వస్తువులే విక్రయిస్తామని వ్యాపారులు, దుకాణదారులు ప్రతిజ్ఞ చేయాలి. దేశానికి సేవ చేయాలనుకుంటే ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రోత్సహించండి. సిందూరాన్ని అవమానిస్తున్నారు మన శక్తి సామర్థ్యాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చాయి. భారత్‌పై దాడికి దిగే ధైర్యం చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, పాతాళ లోకంలో దాక్కున్నా వెతికి మరీ అంతం చేస్తామని తెలియజెప్పాం. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు. మహాశివుడి రుద్ర రూపమే ఆపరేషన్ సిందూర్. మన సైనిక దళాల సాహసాన్ని కాంగ్రెస్ పార్టీ పదేపదే కించపరుస్తోంది. ఆపరేషన్ సిందూర్‌ను తమాషా అంటూ హేళన చేస్తోంది. మన సోదరీమణులు ధరించే పవిత్ర సిందూరాన్ని అవమానిస్తోంది. పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. నా మనసు ఆవేదనతో నిండిపోయింది. ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటామని సిందూరం కోల్పోయిన మన బిడ్డలకు హామీ ఇచ్చా. మహాదేవుడి ఆశీస్సులతో అది నెరవేర్చా. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పరమశివుడి పాదాలకు అంకితం ఇస్తున్నా. 140 కోట్ల మంది భారతీయుల ఐక్యతే ఆపరేషన్ సిందూర్‌కు బలంగా మారింది. శివ అంటే అర్థం మంచి. కానీ, ఉగ్రవాదం, అన్యాయం తల ఎగరేసినప్పుడు శివుడు రుద్రరూపం దాలుస్తాడు.’ అని మోదీ అన్నారు. స్వదేశంలోనే పెళ్లి చేసుకోండి వివాహాల సీజన్ మొదలైంది. పండుగలు రాబోతున్నాయి. ప్రజలు కొత్తగా కొనే వస్తువులు, ఉత్పత్తులు మన దేశంలో తయారైనవే కావాలి. సంపన్నులు విదేశాల్లో వివాహాలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారు వివాహ వేదికను మన దేశానికి మార్చుకోవాలి. గతంలోనూ ఇలాంటి పిలుపు ఇచ్చా. ఎంతమంది స్పందించారో తెలియదు. మన ప్రతి అడుగులో స్వదేశీ అనే భావన ఉంటే అది మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మహాత్మా గాందీకి మనం ఇచ్చే అసలైన నివాళి ఏమిటో తెలుసా?.. స్థానిక ఉత్పత్తులు వాడుకోవడమే. సమ్మిళిత ప్రయత్నం, కృషి ద్వారానే మన దేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోగలం. పాక్ నష్టపోతే ప్రతిపక్షాలకు ఏడుపెందుకో? ‘ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రజలు పండుగలా భావిస్తున్న సమయంలో మన దేశంలోనే కొందరు వ్యక్తులు అది తట్టుకోలేకపోయారు. కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేయడాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు జీరి్ణంచుకోలేపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోని పలు వైమానిక స్థావరాలు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయి. ఇండియా దాడుల్లో నష్టపోయినందుకు పాకిస్తాన్ ఏడుస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. మరి మన దేశంలోని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు వచ్చిన బాధేమిటో అర్థం కావడం లేదు. పాకిస్తాన్‌కు నష్టం జరగడం చూసి ఆ పార్టీల నాయకులు భరించలేకపోతున్నారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్లో మట్టుబెట్టాం. ఈ ఆపరేషన్ ఇప్పుడే ఎందుకు చేపట్టారని సమాజ్‌వాదీ పార్టీ నేతలు ప్రశి్నస్తున్నారు. అంటే ఉగ్రవాదులు పారిపోయేదాకా ఆగాలా? మిమ్మల్ని ఇప్పుడు చంపాలా? లేక తర్వాత చంపాలా? అని ఉగ్రవాదులను అడగాలా? ఇదే సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు క్లీన్చిట్ ఇచ్చారు. బాంబు పేలుళ్లకు పాల్పడిన వారిపై కేసులు ఎత్తేశారు. ఇప్పుడు ఉగ్రవాదులు హతమైపోతుండడం చూసి ఆ నాయకులకు నిద్రపట్టడం లేదు.’ అని మోదీ ఎద్దేవా చేశారు.మన క్షిపణులతో శత్రువుల్లో భయం ఇది నవ భారతం. మహా శివుడిని అరాధిస్తున్నాం. అదే శివుడు అవసరమైనప్పుడు శత్రువులను చీల్చి చెండాడడానికి కాలభైరవుడు అవుతాడు. మన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న క్షిపణులు, డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థల శక్తి ఏమిటో ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపితమైంది. మన బ్రహ్మోస్ క్షిపణులు శత్రువుల్లో భయం పుట్టించాయి. పాకిస్తాన్‌లోని దుష్టులు వారి కలలోనూ ప్రశాంతంగా నిద్రపోలేరు. పాకిస్తాన్ కనుక మన దేశంపై మళ్లీ దాడికి దిగితే.. ఉత్తరప్రదేశ్‌లో తయారవుతున్న క్షిపణులతో పాక్ ఉగ్రవాదులను ఖతం చేస్తాం’’ అని ప్రధాని మోదీ ప్రతిన బూనారు. మోదీకి శివలింగం బహూకరణ ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం ఇది 51వ సారి కావడం విశేషం. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రికి చేతితో తయారు చేసిన శివలింగాన్ని బహూకరించారు. 18 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్న ఈ శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముగ్గురు బనారస్ కళాకారులు తయారు చేశారు. మూడు భౌగోళిక సూచిక(జీఐ) సర్టీఫికెట్లు పొందిన మూడు హస్తకళల సమ్మేళనమే ఈ శివలింగం. మన స్వదేశీ హస్త కళాకృతులు, వ్రస్తాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కళాకారులకు, చేనేత కారి్మకులకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా సూచించారు. ‘లోకల్ టు గ్లోబల్’ మన లక్ష్యం కావాలన్నారు. జీఐ గుర్తింపు లభించిన స్థానిక ఉత్పత్తులను పరిరక్షించుకోవాలని, వాటిని మరింత ప్రోత్సహించాలని కోరారు. -
74th Republic Day: గణతంత్ర పరేడ్‌లో... స్వదేశీ వెలుగులు
74వ గణతంత్ర వేడుకలు స్వదేశీ వెలుగులతో మెరవనున్నాయి. సంప్రదాయ గౌరవ వందనంలో బ్రిటిష్ కాలపు 25–పౌండర్ గన్స్ స్థానంలో స్వదేశీ 105 ఎంఎం తుపాకులు సగర్వంగా గర్జించనున్నాయి. పరేడ్‌లో ప్రదర్శించే ఆయుధాలన్నీ మన దేశంలో తయారైనవే! బ్రిటన్ వలస పాలన నీడల నుంచి బయటపడి పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా ఆత్మనిర్భర్ భారత్ సత్తాను సగర్వంగా చాటేలా గణతంత్ర వేడుకలను జరిపేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చైనాతో ఉద్రిక్తతల వేళ మన సాయుధ సత్తాను చాటడానికి కవాతులో మేడిన్ ఇండియా ఆయుధాలను ప్రదర్శించబోతున్నారు. ఇండిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని, ఆకాశ్, నాగ్ క్షిపణులతో పాటు బ్రహ్మోస్, అర్జున్ యుద్ధ ట్యాంకులు, ప్రచండ హెలికాప్టర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి... బ్రహ్మోస్ ప్రపంచంలో మొట్టమొదటి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. భారత రక్షణ అభివృద్ధి పరిశోధన రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మోస్‌ను విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, భూ ఉపరితలం... ఇలా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో ప్రయాణించగలదు. వంద శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా గుర్తింపు పొందింది. శత్రు దేశాల రాడార్ల నుంచి కూడా సులభంగా తప్పించుకోగల ఈ క్షిపణి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అగ్ని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన క్షిపణి. కాలక్రమేణా ఆధునిక సాంకేతితతో రూపు మార్చుకుంటూ వచ్చింది. అగ్ని 5 వెర్షన్లను రూపొందించిన తర్వాత ఇటీవల అణ్వాయుధ సామర్థ్యంతో అగ్ని ప్రైమ్ ఖండాంతర క్షిపణిని తయారు చేశారు. 2 వేల కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. అర్జున్ ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది. ప్రచండ ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించగలిగే తేలికపాటి హెలికాప్టర్. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) అభివృద్ధి చేసింది. సముద్రమట్టానికి 16,400 అడుగుల ఎత్తులో అలవోకగా టేకాఫ్, ల్యాండింగ్ ప్రత్యేకత. దీనితో రెండు శక్తిమంతమైన ఇంజిన్లు, అత్యంత ఆధునిక సౌకర్యాలుంటాయి. రాత్రి పూట కొండల మధ్య ప్రయాణించగలిగే సత్తాతో పాటు నిమిషానికి 800 రౌండ్లు కాల్పులు జరిపే సామర్థ్యముంది. చైనా డ్రోన్లను కూడా కూల్చివేయగలవు. నేలపై ఉన్న ట్యాంకర్లను సైతం ధ్వంసం చేయగలవు. ఆకాశ్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన భారత్ తొలి క్షిపణి ఆకాశ్. భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. 95% పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందుకు పాతికేళ్లు పట్టింది. 2014లో వైమానిక దళానికి, 2015లో ఆర్మీకి అందజేశారు. వీటిని విదేశాలకు విక్రయించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. కే–9 వజ్ర స్వీయ చోదక శతఘ్ని వ్యవస్థ. 2018లో తొలిసారిగా ఆర్మీకి అందజేశారు. మైదాన ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా పని చేస్తుంది. ప్రస్తుతం లద్ధాఖ్ సరిహద్దుల్లో మోహరించారు. 155 ఎంఎం కెనాన్ కలిగిన ఈ శతఘ్ని 18 నుంచి 52 కి.మీ. దూరం దాకా గుళ్ల వర్షం కురిపించగలదు. దీనికున్న అత్యంత శక్తిమంతమైన ఇంజిన్ గంటకి 67 కి.మీ. వేగంతో పని చేస్తుంది. అర్జున్ ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది. రక్షణ రంగానికి స్వదేశీ హంగులు ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టాక రక్షణ రంగంలో స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆయుధాల కోసం విదేశాల మీద ఆధారపడటం తగ్గించి దేశీయంగా తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. రష్యా వంటి దేశాల సాంకేతిక సహకారంతో దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి ముమ్మరమైంది. 2021లో సాయుధ బలగాలు తమకు కేటాయించిన నిధుల్లో 64% స్వదేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు వినియోగిస్తే గతేడాది 68% నిధులు వినియోగించాయి. ఆర్మీ అత్యధికంగా 72% నిధులను మేడిన్ ఇండియా ఆయుధాలపైనే వెచ్చించింది. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి విలువను 2025 కల్లా 2,500 కోట్ల డాలర్లకు తీసుకువెళ్లే లక్ష్యం దిశగానూ వడివడిగా అడుగులు పడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్ వెహికల్
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్ వెహికల్‌ను తయారు చేసినట్లు ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ) మద్రాస్ పరిశోధకులు ప్రక టించారు. ఈ వాహనం రోడ్లపైనే కాదు, ఇతర అనను కూల ప్రాంతాల్లోనూ ఉపయో గపడు తుందని చెప్పారు. ‘నియోబోల్ట్ అనే పేరు న్న ఈ వాహనంలో వాడే లిథియం– అయాన్ బేటరీని ఒక్కసారి ఛార్జి చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. వీల్‌చైర్ వాడే వారికి ఇది ఎంతో సౌకర్యం, సురక్షితం. ఆటో, స్కూటర్, కారు కంటే దీనికయ్యే ఖర్చు తక్కువ’అని వారన్నారు. ఐఐటీ మద్రాస్ లోని సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైజ్ డెవలప్మెంట్ విభాగం ‘నియో మోషన్’ అనే స్టార్టప్‌తో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తికి సన్నాహాలు ప్రారంభిం చిందన్నారు. ఈ వీల్ చైర్ సుమారుగా రూ.55 వేలకే అందుబాటులోకి వచ్చే అవకా శం ఉందని ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సుజాతా శ్రీనివాసన్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో నియోబోల్ట్ మాదిరి విశిష్టలతో కూడిన వాహనాల ధరలు మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఏటా అమ్ముడయ్యే దాదాపు 3 లక్షల వీల్ చైర్లలో 2.5 లక్షల వీల్ చైర్లు విదేశాల్లో తయారైనవేనని చెప్పారు. -
ఏడాదిలోగా 3 పీఎస్ఎల్వీ ప్రయోగాలు
స్వదేశీ టెక్నాలజీకి పెద్దపీట షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష ప్రయోగాల్లో మరింత స్వావలంబనకు మరో ముందడుగు. ఉపగ్రహ వాహక నౌకల్లో ఇంధనాన్ని నింపేందుకు ఉపయోగించే కీలకమైన వ్యవస్థను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం దీనికి కారణం. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్, శ్రీహరికోట) డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ మంగళవారం ఈ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ (పీఎల్సీ)ను ఈసీఐఎల్ సీఎండీ సుధాకర్ నుంచి లాంఛనంగా అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈసీఐఎల్ కేవలం రెండేళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో పీఎల్సీ కంట్రోలర్లను తయారు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ‘ఎంప్రాజికాన్ 5000’గా పిలుస్తున్న ఈ వ్యసవ్థను జూన్‌లో జరిగే పీఎస్ఎల్వీ సీ-28 ప్రయోగంలో తొలిసారి ఉపయోగించే అవకాశముందని చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత కీలకమైన వ్యవస్థలన్నింటిలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వాడేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే ఈసీఐఎల్‌తో కలసి రూ.3 కోట్ల వ్యయంతో ఈ వ్యవస్థను తయారు చేశామని చెప్పారు. ఉపగ్రహ వాహకనౌకల్లో 97 శాతం వరకూ స్వదేశీ టెక్నాలజీకాగా భూగత వ్యవస్థల్లో మాత్రం 30-40 శాతం దిగుమతులున్నాయని చెప్పారు. ఈ దిగుమతులను కూడా క్రమేపీ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఇస్రో ఈ ఏడాది కనీసం నాలుగు ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుందని, వీటిల్లో మూడు పీఎస్ఎల్వీవి కాగా... స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో జరిపే జీఎస్ఎల్వీ ఐదవదని ప్రసాద్ తెలిపారు. జూన్‌లో మూడు యునెటైడ్ కింగ్డమ్ ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ సీ-28 ప్రయోగం ఉంటుందని ఆయన చెప్పారు. ఆ తరువాత ఆగస్టులో ఎస్‌బ్యాండ్ కమ్యూనికేషన్ల కోసం జీశాట్-6 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగిస్తామన్నారు. వీటితోపాటు ఈ ఏడాది చివరిలోగా రెండు నావిగేషన్ శాటిలైట్లు (ఐఆర్ఎన్ఎస్ 1ఈ, 1ఎఫ్)లను ప్రవేశపెడుతున్నామన్నారు. భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న జీపీఎస్ తరహా నావిగేషన్ వ్యవస్థను వచ్చే ఏడాది పరీక్షిస్తామని, 200-300 రిసీవర్లను తయారు చేసి వ్యవస్థ పనితీరును పరిశీలిస్తామని ప్రసాద్ తెలిపారు. ఈ వ్యవస్థకు మొత్తం 7 ఉపగ్రహాలు అవసరం కాగా... ఇప్పటికే నాలుగింటిని ప్రయోగించామని, మరో రెండింటిని ప్రయోగించిన తరువాత ఈ పరీక్షలు చేపడతామన్నారు.