స్వదేశీ మేళాకు పట్టం కట్టండి  | PM Narendra Modi asks NDA MPs to hold Swadeshi Mela | Sakshi
Sakshi News home page

స్వదేశీ మేళాకు పట్టం కట్టండి 

Sep 9 2025 4:49 AM | Updated on Sep 9 2025 4:49 AM

PM Narendra Modi asks NDA MPs to hold Swadeshi Mela

ట్రంప్‌ సుంకాల వేళ ఎన్‌డీఏ ఎంపీలకు మోదీ ఉద్బోధ 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జాగ్రత్తగా ఓటేయాలని సూచన 

న్యూఢిల్లీ: స్నేహితుడు, శత్రువు అనే బేధం లేకుండా అమెరికా ప్రభుత్వం అందరిపై సుంకాలతో బాదేస్తున్న వేళ ప్రధాని మోదీ స్వదేశీరాగం అందుకున్నారు. విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకుని స్వదేశీ వస్తువులకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో సోమవారం ఎన్‌డీఏ కూటమి ఎంపీలతో సమావేశంలో పలు అంశాలపై ప్రధాని మాట్లాడారు. ‘‘దేశవాళీ ఉత్పత్తులకు ఆదరణ పెరిగేలా చూడండి. స్వదేశీ మేళాను ఉద్యమస్థాయికి తీసుకెళ్లండి. విదేశాల అధిక టారిఫ్‌ల వంటి ప్రతికూలతలు, సవాళ్ల సమయంలో భారత్‌ స్వావలంబన ద్వారా తన శక్తిసామర్థ్యాలను మరింతగా సంతరించుకోవాల్సిన తరుణమిది.

 మేడిన్‌ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించండి. జీఎస్టీ రేట్లు భారీగా తగ్గిన చక్కటి తరుణంలో స్వదేశీ వస్తువుల గొప్పతనాన్ని జనాన్ని తెలిసేలా చేయండి. ముఖ్యంగా నవరాత్రి, దీపావళి వంటి పండుగల సీజన్‌లో మీమీ నియోజకవర్గాల్లో ప్రజలతో, వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటుచేసి తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలను వివరించండి’’అని మోదీ అన్నారు. మోదీ ప్రసంగ వివరాలను తర్వాత కేంద్ర మంత్రి కిరెణ్‌ రిజిజు మీడియాకు వివరించారు. అమెరికా 50 శాతం టారిఫ్‌ భారం మోపిన వేళ మోదీ స్వదేశీ వస్తువుల ప్రాశస్థ్యాన్ని ప్రస్తావించడం గమనార్హం. 

శక్తివంతమయ్యేవేళ సవాళ్లు సాధారణం 
‘‘భారత్‌ శక్తివంతంగా ఎదిగే క్రమంలో సవాళ్లు ఎదురవడం సాధారణం. అయినాసరే అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించే క్రమంలో ఇలాటి సవాళ్లను ఎదుర్కొంటూ ఆత్మనిర్భర్‌ను సాధించాలి. సొంత నియోజకవర్గాల్లో దేశీయ ఉత్పత్తుల ప్రచారాన్ని మీరే నాయకులుగా ముందుండి నడపాలి. గతంలో భారత్‌లో జపాన్‌ తయారీ వస్తువుల వినియోగం అధికంగా ఉండేది. అలాంటి భారత్‌లో ఇప్పుడు దేశీయోత్పత్తులను అధికంగా ఉపయోగించగల్గుతున్నామని గర్వపడేలా మనం చేయాలి. మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో స్వదేశీ ఉత్పత్తులు కనిపించాలి. ఉపయోగించాలి’’అని ఎంపీలకు మోదీ సూచించారు. ‘‘జీఎస్‌టీ శ్లాబుల తొలగింపు అనేది ప్రజల్లో పెను సంచలనంగా మారింది. ప్రజలతో ‘స్వదేశీ మేళాలు’, వ్యాపారులతో ‘వ్యాపారీ సమ్మేళన్‌’లు నిర్వహించండి. గాల్లో తుపాను చెలరేగినాసరే మనం వాహన టైరులో మళ్లీ గాలి కొట్టాల్సిందే. అలాగే దేశీయంగా ‘స్వదేశీ వాతావరణం’ఉన్నాసరే మన మళ్లీ విడిగా మన వంతు తోడ్పాటు అందించాల్సిందే’’అని అన్నారు.  

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జాగ్రత్త 
‘‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఎంపీలు జాగ్రత్త వహించండి. తప్పులు దొర్లకుండా ఓటేయండి. పార్లమెంట్‌ సభ్యులే ఓటింగ్‌లో తప్పులు చేస్తే ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుంది. మన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఉత్తమ అభ్యర్థిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా చక్కటి సేవలు అందిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. తన పాలనాదక్షతతో ఆయ ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తేగలరని నేనూ విశ్వసిస్తున్నా’’అని అన్నారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు ఆమోదం పొందం వెనుక అధికార కూటమి ఎంపీల కృషిదాగి ఉందని మోదీ ప్రశంసించారు.  

హిమాచల్, పంజాబ్‌కు నేడు మోదీ 
వరద విలయంలో చిక్కుకుని అల్లాడిపోతున్న హిమాచల్‌ ప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ మంగళవారం పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకూ మోదీ వెళ్లి అక్కడి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. హిమాచల్‌లోని కంగ్రాకు మోదీ వెళ్లనున్నారు. అక్కడే ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement