కాశీ సాక్షిగా నవశకం

PM Narendra Modi inaugurates Phase 1 of Kashi Vishwanath Corridor in Varanasi - Sakshi

ఆత్మన్యూనత నుంచి అభివృద్ధి వైపు భారత్‌: ప్రధాని మోదీ

దేశ నాగరిక వారసత్వానికి గొప్ప ప్రతీక కాశీ

మహోన్నత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటోంది

కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం  

భారతదేశ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదు. మనల్ని మనం ఎలా చూసుకుంటామో ప్రపంచమంతా మనల్ని అలాగే చూస్తుంది. స్వచ్ఛత, సృజన మన మార్గం కావాలి. స్వచ్ఛ భారత్‌ ఉద్యమంలో అందరూ పాలుపంచుకోవాలి.

కాశీ కారిడార్‌ భారత్‌కు నిర్ణయాత్మక దిశను చూపుతుంది. భవ్యమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. కొత్త చరిత్ర పురుడు పోసుకుంటోం ది. ఈ చరిత్రకు సాక్షులం కావడం మన అదృష్టం.

► కాశీ ఆలయం గతంలో 3,000 చదరపు అడుగుల్లోనే ఉండేది. ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించింది. నిత్యం 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు సులభంగా దర్శించుకోవచ్చు. శివుడి రక్షణలోని కాశీ ఎన్నటికీ నాశనం కాబోదు.
 

► కాశీ విశ్వనాథ్‌ ధామం ఒక భారీ భవంతి మాత్రమే కాదు. దేశ సనాతన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు చిహ్నం. అయోధ్యలో రామమందిరం, కాశీలో విశ్వనాథ్‌ ధామంతోపాటు బౌద్ధ, సిక్కు పర్యాటక కేంద్రాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం.

► ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ సైతం ఉద్భవిస్తాడు. సాలార్‌ మసూద్‌ మన దేశంలో అడుగుపెడితే రాజా సుహల్‌దేవ్‌ అతడిని ఎదుర్కొంటాడు. మన ఐక్యతలోని శక్తిని తెలియజేస్తాడు. ఎన్నో కుతంత్రాలను తట్టుకుని కాశీ సగర్వంగా నిలిచింది.

నవ చరిత్రకు సాక్షులం
► ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ ఉద్భవిస్తాడు
► సాలార్‌ మసూద్‌ వస్తే రాజా సుహల్‌దేవ్‌ ఎదుర్కొంటాడు  
► భారత్‌ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదు
► దేశ నాగరిక వారసత్వానికి గొప్ప ప్రతీక కాశీ
► మహోన్నత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటోంది
► కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం  

వారణాసి: భారతదేశ నాగరిక వారసత్వానికి, ఔన్నత్యానికి కాశీ నగరం గొప్ప ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఔరంగజేబు లాంటి నిరంకుశ పాలకులు కాశీని నాశనం చేసేందుకు ప్రయత్నించారని, అప్పటి దాడులు, దౌర్జన్యకాండ చరిత్ర పుటల్లో చీటిక అధ్యాయాలుగా మిగిలిపోయాయనని అన్నారు. మన ప్రాచీన పవిత్ర నగరం కాశీ తన మహోన్నతమైన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఎంతోమంది గొప్ప వ్యక్తులకు కాశీ కర్మభూమి, జన్మభూమి అన్నారు.

ప్రధాని మోదీ సోమవారం తన నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. శతాబ్దాల బానిసత్వం భారత్‌ను ఆత్మన్యూనతకు గురిచేసిందని, ఆ ప్రభావం నుంచి దేశం క్రమంగా బయటపడుతోందని చెప్పారు. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ భారత్‌కు నిర్ణయాత్మక దిశను చూపుతుందని, భవ్యమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త చరిత్ర పురుడు పోసుకుంటోందన్నారు. ఈ నవ చరిత్రకు సాక్షులం కావడం మనం అదృష్టమని చెప్పారు.

ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ సైతం ఉద్భవిస్తాడని, సాలార్‌ మసూద్‌(భారత్‌పై దండెత్తిన ముస్లిం) మన దేశంలో అడుగుపెడితే రాజా సుహల్‌దేవ్‌ అతడిని ఎదుర్కొంటాడని, మన ఐక్యతలోని శక్తిని తెలియజేస్తాడని అన్నారు. ఔరంగజేబు, సాలార్‌ మసూద్, వారెన్‌ హేస్టింగ్స్‌ లాంటి వాళ్లు కాశీని ధ్వంసం చేయడానికి ఎన్నో కుతంత్రాలు సాగించారని, అన్నింటినీ తట్టుకొని నగరం సగర్వంగా నిలిచిందని చెప్పారు. సుల్తాన్లు వచ్చారు, పోయారు గానీ కాశీ మాత్రం స్థిరంగా నిలిచి ఉందని పేర్కొన్నారు. ఈ దేశం మట్టి మిగతా ప్రపంచం కంటే భిన్నమైనదని వివరించారు. తన ప్రసంగం మధ్యలో పలుమార్లు ‘హర హర మహదేవ్‌’ మంత్రాన్ని పఠించారు. అప్పుడప్పుడు స్థానిక యాసలో మాట్లాడుతూ ఆహూతులను ఆకట్టుకున్నారు.

సనాతన సంస్కృతికి చిహ్నం
రాణి అహల్యాబాయి కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని పునర్నిర్మించారని, సిక్కు రాజు రంజిత్‌ సింగ్‌ ఈ గుడి గోపురాలకు బంగారు పూత వేయించారని మోదీ గుర్తుచేశారు. కాశీ విశ్వనాథ్‌ ధామం కేవలం ఒక భారీ భవంతి మాత్రమే కాదని, దేశ సనాతన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు చిహ్నం అని వెల్లడించారు. అయోధ్యలో రామమందిరం, కాశీలో విశ్వనాథ్‌ ధామంతోపాటు సముద్రంలో వేలాది కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్, పేదల కోసం లక్షలాది ఇళ్లను భారత్‌ నిర్మించుకుంటోందని, పరిశోధకులను అంతరిక్షంలోకి పంపిస్తోందని తెలిపారు. బౌద్ధ, సిక్కు పర్యాటక కేంద్రాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. విశ్వనాథ్‌ ధామం పాత, కొత్తల మేలు కలయిక అని అన్నారు. మన శక్తిసామర్థ్యాలకు ఈ ధామం ఒక సాక్షిభూతమని, గట్టి పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని వివరించారు.

సృజనాత్మకతకు పదును పెట్టండి
భారతదేశ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదని మోదీ తేల్చిచెప్పారు. మనల్ని మనం ఎలా చూసుకుంటామో ప్రపంచమంతా మనల్ని అలాగే చూస్తుందని చెప్పారు. స్వయం సమృద్ధ (ఆత్మనిర్భర్‌) భారత్‌ కోసం ప్రయత్నాలు కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛత, సృజన మన మార్గం కావాలన్నారు.  నమామి గంగా మిషన్‌ను విజయవంతం చేయాలన్నారు. భారత్‌ ఎన్నో శతాబ్దాలపాటు బానిసత్వం కింద మగ్గిపోయిందని, ఇది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని, ఫలితంగా మన సృజనపై మనం నమ్మకాన్ని కోల్పోయామని చెప్పారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో సృజనాత్మకతకు పదును పెట్టాలని ప్రజలకు సూచించారు. త్వరలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోబోతున్నామని, మరో 25 ఏళ్ల తర్వాత (100వ స్వాతంత్య్ర దినోత్సవాల నాటికి) ఇండియా ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అందుకోసం ఇప్పటినుంచి కృషి చేయాలని పేర్కొన్నారు.

కాశీకి శివుడే రక్షణ
కాశీ విశ్వనాథ ఆలయాన్ని భారీగా విస్తరించామని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో ఈ ఆలయం 3,000 చదరపు అడుగుల్లోనే ఉండేదని, ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించిందని చెప్పారు. నిత్యం 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు సులభంగా దర్శించుకోవచ్చని అన్నారు. శివుడి రక్షణలో ఉన్న కాశీ నగరం ఎన్నటికీ నాశనం కాబోదని వ్యాఖ్యానించారు.

మోదీకి తలపాగా బహూకరణ
మోదీ రాకతో వారణాసి సందడిగా మారింది. హర హర మహాదేవ్, మోదీ మోదీ అని నినదిస్తూ జనం ఆయనకు స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లారు. కాలభైరవ మందిరం వద్ద కారులో ఉన్న మోదీ దగ్గరకు వచ్చేందుకు ఓ బ్రాహ్మణుడు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అది గమనించిన మోదీ చేతులు ఊపారు. దీంతో భద్రతా సిబ్బంది సదరు బ్రాహ్మణుడిని అనుమతించారు. ఆయన మోదీకి గులాబీ రంగు తలపాగా, కాషాయం రంగు అంగవస్త్రాన్ని బహూకరించారు. మోదీ కటౌట్లు, పోస్టర్లతో కాశీ వీధులు నిండిపోయాయి.

గంగా హారతి తిలకించిన ప్రధాని
మోదీ 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో కలిసి సోమవారం సాయంత్రం గంగా నదిలో ఓడపై విహరించారు. ప్రఖ్యాత దశాశ్వమేధ ఘాట్‌ వద్ద ఆగి, గంగా హారతిని తిలకించారు.  

కూలీలపై పూలవర్షం
కాశీ విశ్వనాథ్‌ ధామం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలకు  మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వినమ్రంగా చేతులు జోడించి అభివాదం చేశారు. వారిపై పూల రేకులు చల్లారు. కూలీతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం వారితోపాటు కూర్చొని ఫొటో దిగారు.

విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు
సోమవారం ఉదయం కాశీకి చేరుకున్న మోదీ కాలభైరవ ఆలయంలో(కాశీ కా కొత్వాల్‌) ప్రత్యేక పూజలు చేశారు. గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించారు. కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసేందుకు స్వయంగా కలశంలో గంగా జలాన్ని సేకరించారు. ఆలయానికి చేరుకొని విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథ్‌ ధామ్‌ ప్రాంగణంలో భారతమాత, మహారాణి అహల్యాబాయి హోల్కర్, ఆది శంకరాచార్య విగ్రహాలను అధికారులు ఏర్పాటు చేశారు. ‘కాశీ విశ్వనాథ్‌ ధామ్‌’ ప్రారంభోత్సవంలో యూపీ సీఎం యోగి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, వేలాది మంది మత గురువులు, సాధువులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

వారణాసిలో కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న ప్రధాని మోదీ


భరతమాత విగ్రహానికి నమస్కరిస్తూ..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top