ఏడాదిలోపే కోవిడ్‌ ఆయుధాలు సిద్ధం | PM Narendra Modi hails Indian scientists for Made in India vaccines | Sakshi
Sakshi News home page

ఏడాదిలోపే కోవిడ్‌ ఆయుధాలు సిద్ధం

Jun 5 2021 5:01 AM | Updated on Jun 5 2021 5:01 AM

PM Narendra  Modi hails Indian scientists for Made in India vaccines - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దాడి ప్రారంభమై సంవత్సరం గడవకముందే దానిపై పోరాటానికి ఆయుధాలను సిద్ధం చేసిన భారతీయ శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. దేశీయంగా కరోనా టీకాను రికార్డు సమయంలో రూపొందించారని ప్రశంసలు కురిపించారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) సంస్థ శాస్త్రవేత్తలతో ప్రధాని శుక్రవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. సీఎస్‌ఐఆర్‌కు ప్రధాని ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు.

గతంలో విదేశాల్లో రూపొందించిన వాటిని పొందేందుకు భారత్‌ సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని అన్నారు. విదేశీ శాస్త్రవేత్తలతో కలిసి, సరిసమానంగా భారతీయ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారన్నారు. ఈ శతాబ్దంలో మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం కరోనా అని ప్రధాని పేర్కొన్నారు. అయితే, మానవాళి ఏదైనా సంక్షోభం ఎదుర్కొన్న ప్రతీసారి.. సైన్స్‌ దాన్ని ఎదుర్కోవడానికి మార్గం చూపిందని మనకు చరిత్ర చెబుతోందని వివరించారు. మేడ్‌ ఇన్‌ ఇండియా వ్యాక్సిన్‌నే కాకుండా, దేశీయంగా కరోనా టెస్టింగ్‌ కిట్స్‌ను, కోవిడ్‌ చికిత్సకు ఔషధాలను రికార్డు సమయంలో భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించి, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ను నిజం చేశారని ప్రశంసించారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ దేశీయంగా కోవాగ్జిన్‌ కోవిడ్‌ టీకాను తయారుచేసిన విషయం తెల్సిందే.

ఆక్సిజన్‌ ఉత్పత్తిని కూడా రికార్డు సమయంలో భారీగా పెంచామని గుర్తు చేశారు. ‘మీ కృషి, మీ అద్భుతమైన మేథ కారణంగానే ఈ భారీ యుద్ధాన్ని చేయగలుగుతున్నాం’అని సైంటిస్ట్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. స్వయం సమృద్ధ భారత్, సుదృఢ భారత్‌ తమ లక్ష్యాలని, అయితే, ఈ కరోనా మహమ్మారి కారణంగా ఆ లక్ష్యసాధన కొంత ఆలస్యమవుతోందని వివరించారు. అయితే, కచ్చితంగా వాటిని సాధిస్తామన్నారు. ‘మన లక్ష్యాలెప్పుడూ భవిష్యత్తు కన్నా రెండడుగులు ముందుండాలి’అన్నారు.  సుస్థిరాభివృద్ధి, స్వచ్ఛ విద్యుత్‌ తదితర అంశాల్లో భారత్‌ ప్రపంచ దేశాలకు మార్గం చూపుతోందని, సాఫ్ట్‌వేర్, శాటిలైట్‌ టెక్నాలజీలతో చాలా దేశాల అభివృద్ధిలో భాగం పంచుకుంటోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో వాతావరణ మార్పు మహమ్మారిని ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తల బృందం ఇప్పటినుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2016లో ప్రారంభించిన ‘అరోమా మిషన్‌’విజయంలో సీఎస్‌ఐఆర్‌ పాత్రను ప్రధాని గుర్తు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement