ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
కర్ణాటకలో ఆదిచుంచనగిరి మహాసంస్థాన్ మఠాన్ని దర్శించుకున్న మోదీ
శ్రీకాలభైరవేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
మాండ్య: ‘అభివృద్ధి చెందిన కర్ణాటక, అభివృద్ధి చెందిన భారత్’అనే స్వప్నం సాకారం కావడానికి ప్రజలు తొమ్మిది సామూహిక ప్రతిజ్ఞలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం, శారీరక దృఢత్వం, సామాజిక సేవ వంటి అంశాల్లో ప్రతిజ్ఞలను ఆయన సూచించారు. తొమ్మిది ప్రతిజ్ఞల విషయంలో మనం నిజాయతీ, దృఢ నిశ్చయంతో ముందుకు సాగితే వికసిత్ కర్ణాటక, వికసిత్ భారత్ దిశగా శరవేగంగా పురోగమించగలమని స్పష్టంచేశారు.
బుధవారం కర్ణాటక రాష్ట్రం మాండ్యలో ఆదిచుంచనగిరి మహాసంస్థాన్ మఠాన్ని ప్రధానమంత్రి దర్శించుకున్నారు. శ్రీగురు భైరవైక్య మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి, జేడీ(ఎస్) అధినేత హెచ్.డి.దేవెగౌడతో కలిసి ‘సౌందర్య లహరి, శివ మహిమ స్తోత్రం’పుస్తకాన్ని విడుదల చేశారు. జ్వాలా పీఠాన్ని సైతం దర్శించుకున్నారు. శ్రీకాలభైరవేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
మోదీ ప్రతిజ్ఞలు
1. జల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. జల వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
2. ఏక్ పేడ్ మా కే నామ్(తల్లి పేరిట ఒక మొక్క) కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలి.
3. జన సమ్మర్థం కలిగిన ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
4. మన నినాదం వోకల్ ఫర్ లోకల్. స్థానిక ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలి. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే మన దేశాభివృద్ధికి అది ఎంతగానో దోహదపడుతుంది.
5.దేశీయంగా అందుబాటులో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించాలి. తద్వారా మన దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి.
6. వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందులను పక్కనపెట్టాలి. రసాయన రహిత, ప్రకృతి హిత వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.
7. మన రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను ఒక భాగంగా మార్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
8.నేడు ఒబెసిటీ అతిపెద్ద సవాలుగా మారింది. అందుకే వంటల్లో నూనె వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి. శారీరక ఆరోగ్యం కోసం నూనె తక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నూనె వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకుంటే ఊబకాయ సమస్య పరిష్కారమవుతుంది.
9.యోగాసనాలను మర్చిపోవద్దు. నిత్యం యోగా చేసే ఆరోగ్యకరమైన జీవితం సొంతమవుతుంది. ఫిట్‌నెస్ సాధించడం మన లక్ష్యం. సేవాభావాన్ని పెంపొందించుకోవాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి.


