
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మహీంద్రా ట్రాక్టర్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని వర్చువల్‌గా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కేంద్రం గ్రామీణ యువతకు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలలో శిక్షణ అందించడం, వారి నూతన అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. మహీంద్రా ట్రాక్టర్స్ వృత్తి విద్య, శిక్షణ విభాగం (డీవీఈటీ).. మహారాష్ట్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంఘం (ఎంఎస్‌ఎస్‌డీఎస్) భాగస్వామ్యంతో గడ్చిరోలిలోని ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్సిట్యూట్ (ఐటీఐ) కళాశాలలో ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది.
గడ్చిరోలిలో ఏర్పాటు చేసిన ఈ ట్రాక్టర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా మహీంద్రా సంస్థ ట్రాక్టర్, తరహా వ్యవసాయ యంత్రాల వినియోగంలో యువతకు నైపుణ్యాన్ని అందిస్తుంది. ఇందుకోసం అత్యుత్తమ నిపుణుల సేవలను వినియోగించుకోనుంది. ఈ కేంద్రం బహుళ కెరీర్ అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా మీడియాతో మాట్లాడుతూ ‘గడ్చిరోలిలో మహీంద్రా ట్రాక్టర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. మహారాష్ట్ర కేవలం ఒక ప్రముఖ పారిశ్రామిక కేంద్రం మాత్రమే కాదు.. వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం. గ్రామీణ యువత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకోవడం మాకు గర్వకారణం’ అని అన్నారు.
1963లో స్థాపితమైన మహీంద్రా ట్రాక్టర్స్ నాలుగు దశాబ్దాలుగా భారతదేశంలో నంబర్ వన్ ట్రాక్టర్ బ్రాండ్‌గా నిలిచింది. ఇటీవల 50కిపైగా దేశాలలో నాలుగు మిలియన్ ట్రాక్టర్లను విక్రయించి, మరో మైలురాయిని దాటింది. మహీంద్రా ట్రాక్టర్స్ మన్నిక, పనితీరు, విశ్వసనీయతకు పేరొందింది. ఈ ట్రాక్టర్లు వ్యవసాయ పనులకు అత్యుత్తమంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. నాణ్యత, తయారీ ప్రమాణాలలో అత్యుత్తమ ప్రతిభకు డెమింగ్ అవార్డును మహీంద్రా ట్రాక్టర్స్ అందుకుంది. 300కు మించిన ట్రాక్టర్ మోడళ్లతో, స్థిరమైన అమ్మకాలు కలిగి, అంతర్జాతీయంగానూ మహీంద్రా ట్రాక్టర్స్ పేరుగాంచింది.