వీడియో: కర్ణాటక బీజేపీ నేతకు మోదీ సర్‌ప్రైజ్‌ కాల్‌.. ఎగ్జయిట్‌ అయిన మాజీమంత్రి

PM Modi Dials Top Karnataka BJP Leader KS Eshwarappa - Sakshi

బెంగళూరు: దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పకు ఫోన్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆయన.. ఆ మరుసటి రోజే ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ స్వయంగా ఈశ్వరప్పకు ఫోన్‌ చేయడం గమనార్హం. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న తరుణంలో.. పార్టీ దిద్దుబాటు చర్యకు దిగింది. ఇప్పటికే చాలామంది సీనియర్లకు ప్రత్యామ్నాయ హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఈశ్వరప్పకు స్వయంగా ఫోన్‌ చేశారు మోదీ. ‘‘మీలాంటి గొప్ప నేత.. నాలాంటి ఓ సాధారణ కార్యకర్తకు ఫోన్‌ చేయడం గొప్పగా భావిస్తున్నా అని ఈశ్వరప్ప, మోదీతో పేర్కొన్నారు. 

దానికి ప్రతిగా.. ‘మీరు పార్టీ పట్ల వీరవిధేయతను కనబరిచారు. అందుకు నాకు సంతోషంగా ఉంది. అందుకే మీతో మాట్లాడాలనుకున్నా. ఈశ్వరప్పజీ.. థాంక్యూ’ అని ప్రధాని మోదీ ఆ కాల్‌లో ఆయనకు బదులిచ్చారు. అంతేకాదు.. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన శివమొగ్గ నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న చెన్నబసప్ప తరపున తాను ప్రచారం సైతం చేస్తానని, కర్ణాటకలో బీజేపీ గెలుపునకు తన శాయశక్తులా కృషిచేస్తానని ఈశ్వరప్ప.. మోదీకి హామీ ఇచ్చారు. 

ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఈశ్వరప్ప.. ఆరో దఫా సైతం పోటీ చేయాలని భావించగా, పార్టీ ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో అసంతృప్తితో రగిలిపోతూ ఆయన ఎన్నికల రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ బహిరంగ ప్రకటన చేశారు. ఇక శుక్రవారం ప్రధాని మోదీతో ఫోన్‌కాల్‌ మాట్లాడిన అనంతరం.. ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడారు. 

ఇదీ చదవండి: వివాదాల పుట్ట.. ఈశ్వరప్ప

మోదీగారు తనకు ఫోన్‌ చేస్తారని జీవితంలో అనుకోలేదని, ఆయన చేసిన పని తనకెంతో స్ఫూర్తినిచ్చిందని మీడియాకు ఈశ్వరప్ప బదులిచ్చారు. 

బీజేపీ మే 10వ తేదీన జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఎక్కువగా కొత్త ముఖాలను, యూత్‌ లీడర్లను  దించుతోంది. దీంతో పార్టీ దిగ్గజాల్లో చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం జగదీష్‌ షెట్టర్‌ కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు కూడా.  అయితే మొదట ఈశ్వరప్ప సైతం పార్టీతీరుపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం నడిచినప్పటికీ, తాను పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానంటూ గురువారం ఈశ్వరప్ప ఒక ప్రకటన చేశారు కూడా. తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది కూడా పార్టీని బలోపేతం చేయడానికేనని పేర్కొన్నారు. పాతికేళ్లుగా శివమొగ్గ ప్రజలకు సేవలందించా. ఇకపైనా వాళ్లకు అందుబాటులో ఉంటా అని పేర్కొన్నారాయన. 

ఇదీ చదవండి: ఈశ్వరప్ప కొడుకుకూ దక్కని సీటు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top