పెట్రోల్‌ రూ.120 దాటేసింది

Petrol crosses Rs 120 mark in Madhya Pradesh - Sakshi

మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో రికార్డు స్థాయిలో ధరలు

వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్‌ రేటు

న్యూఢిల్లీ/భోపాల్‌:  లీటర్‌కు రూ.120.. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్‌ ధరల్లో కొత్త రికార్డు ఇది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో లీటర్‌ ధర రూ.120 మార్కును దాటేసింది. పెట్రోల్, డీజిల్‌ ధరలు వరుసగా నాలుగో రోజు.. ఆదివారం సైతం 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండింటి ధరల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రేటు రూ.109.34కు, డీజిల్‌ రేటు రూ.98.07కు చేరింది.

మధ్యప్రదేశ్‌లో స్థానిక పన్నుల కారణంగా పెట్రోల్‌ ధర మోత మోగుతోంది. పన్నా, సాత్నా, రేవా, షాడోల్, చింద్వారా, బాలాఘాట్‌ తదితర ప్రాంతాల్లో లీటర్‌ రూ.120కి పైగానే పలుకుతోంది. రాజస్తాన్‌లోని గంగానగర్, హనుమాన్‌గఢ్‌లోనూ లీటర్‌ రేటు రూ.120 దాటింది. దేశంలోనే అత్యధిక ధర గంగానగర్‌లో ఉంది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రేటు రూ.121.52కు, డీజిల్‌ రేటు రూ.112.44కు ఎగబాకింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 28 నుంచి ఇప్పటిదాకా పెట్రోల్‌ ధర 25 సార్లు (లీటర్‌కు రూ.8.15) పెరిగింది. సెప్టెంబర్‌ 24 నుంచి డీజిల్‌ రేటు 28 సార్లు(లీటర్‌కు రూ.9.45) పెరిగింది.

రండి.. మా దగ్గర ధర తక్కువ
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ఆదివారం వార్తాపత్రికలు తెరిచిన జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గోండియాలో పెట్రోల్, డీజిల్‌ రేటు లీటర్‌కు రూ.4 తక్కువ, అక్కడే పోయించుకోండంటూ ముద్రించిన కరపత్రాలు అందులో ఉండడమే ఇందుకు కారణం.  బాలాఘాట్‌ నుంచి గోండియాకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నా పెట్రో ధరల్లో వ్యత్యాసం రూ.4 కు పైగా ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top