మత ఘర్షణల నేపథ్యంలో.. యోగి సర్కార్‌ కీలక నిర్ణయం

Permission For Religious Procession Yogi Govt Amid Clashes - Sakshi

మత హింసకు సంబంధించిన ఘటనలు పలు రాష్ట్రాల్లో నమోదు అవుతున్న నేపథ్యంలో.. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అప్రమత్తం అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. మతపరమైన ఉరేగింపులు, ర్యాలీలకు అధికారుల అనుమతులు తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.
 
సోమవారం సాయంత్రం శాంతి భద్రతల మీద ఉన్నతాధికారుల సమీక్షలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం యోగి. ఈద్‌, అక్షయ  తృతీయ ఒకేరోజు వస్తున్న నేపథ్యం, వరుస పెట్టి పండుగలు ఉన్న కారణంతోనే అనుమతులు తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే లౌడ్‌స్పీకర్ల ఉపయోగం.. ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ప్రతీఒక్కరికీ వాళ్ల వాళ్ల మతవిశ్వాసాలకు తగ్గట్లు ఆరాధించే స్వేచ్ఛ ఉంటుంది. అలాగే అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత పోలీసులకూ ఉంటుంది. కాబట్టి, మతపరమైన సంస్థలు.. శాంతి, భద్రతలను పరిరక్షణలో భాగంగా ప్రతిజ్ఞ చేస్తూ.. ఊరేగింపులు, ఉత్సవాలకు అనుమతులు తీసుకోవాల్సిందే. అలాగే మత సంప్రదాయాలను అనుసరించి పండుగలకు మాత్రమే ఈ అనుమతులు ఉంటాయి. కొత్త కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అని సీఎం యోగి.. పోలీస్‌ శాఖకు సూచించినట్లు తెలుస్తోంది.

శ్రీరామ నవమి, హానుమాన్‌ జయంతి శోభాయాత్రల సందర్భంగా పలు రాష్ట్రాల్లో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మత ఘర్షణలపై కేంద్రం మౌనంగా ఉండడాన్ని తప్పుబడుతూ..  13 పార్టీలు ఈ అల్లర్ల వెనుక ఉన్నవాళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో యూపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యోగి సర్కార్‌ జాగ్రత్త పడుతోంది.

చదవండి: ఇది యూపీ.. ఏం జరిగిందో చూశారుగా!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top