Indian Railways: పలు ప్యాసింజర్‌ రైళ్ల రద్దు.. ఆలస్యం! గూడ్స్‌ రైళ్ల వల్లే అంతా..!

Passenger Trains Cancelled Due To Make Way For Coal Trains - Sakshi

దేశవ్యాప్తంగా పలు ప్యాసింజర్‌ రైళ్లను అర్ధాంతరంగా ఇండియన్‌ రైల్వేస్‌ రద్దు చేస్తోంది. అంతేకాదు చాలావరకు ప్యాసింజర్‌ రైళ్లు విపరీతమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. ఈ పరిణామాలేవీ ఊహించని ప్రయాణికులు.. ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఎందుకంటారా?.. తీవ్రమైన బొగ్గు కొరత. 

అవును.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కొనసాగుతోంది. వేసవి కావడం.. విద్యుత్‌ వినియోగం పెరిగిపోవడంతో బొగ్గుకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో.. విద్యుత్‌ సంక్షోభం తలెత్తే ఘటింకలు మోగుతుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. బొగ్గు సరఫరా కోసం మార్గం సుగమం చేసేందుకే ప్యాసింజర్‌ రైళ్లను రద్దుచేయడం, ఆలస్యంగా నడపడం చేస్తోంది రైల్వే శాఖ. అంతేకాదు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతంగా బొగ్గు లోడ్‌ను గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తోంది. 

  
భారత్‌లో 70 శాతం కరెంట్‌ బొగ్గు నుంచే ఉత్పత్తి అయ్యేది. అలాంటిది దేశంలో ప్రస్తుతం అనేక ప్రాంతాలు చాలా గంటలు కరెంట్‌ కోతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని పరిశ్రమలు అయితే ఈ శిలాజ ఇంధనం కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ఆజ్యం పోసిన అధిక ఇంధన ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కష్టపడుతున్న సమయంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.

మొత్తంగా 670 ప్యాసింజర్‌ ట్రిపులను మే 24వ తేదీవరకు రద్దు చేసినట్లు.. మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు నొటిఫై చేసింది రైల్వేస్‌.  అయితే ఏయే రూట్‌లలో ప్రయాణాలు రద్దు అనేది ప్రయాణికులే గమనించాలని కోరింది. అలాగే ప్యాసింజర్‌ రైళ్ల అంతరాయం తాత్కాలికం మాత్రమేనని, అతిత్వరలోనే పరిస్థితి చక్కబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఇండియన్‌ రైల్వేస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గౌరవ్‌కృష్ణ బన్సాల్‌. ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరుతున్నారు.

బొగ్గు సరఫరాలో అంతరాయాలకు భారతీయ రైల్వే తరచు విమర్శలు ఎదుర్కొనడం సహజంగా మారింది. సరిపడా క్యారేజీలు లేకపోవడం వల్ల ఎక్కువ దూరాలకు ఇంధనాన్ని తీసుకెళ్లడం కష్టంగా ఉంటోంది. అలాగే రద్దీగా ఉండే మార్గాల్లో ప్యాసింజర్,  గూడ్స్ రైళ్లు తమ తమ ప్రయాణాల కోసం తంటాలు పడుతుంటాయి. కొన్నిసార్లు సరుకులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ, గనులకు దూరంగా ఉన్న వినియోగదారుల కోసం క్యారియర్ బొగ్గు రవాణా కొనసాగుతోంది.

ఢిల్లీలో పరిస్థితి ఘోరం

ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే బొగ్గు కొరత తీవ్రంగా మారుతోంది. దీంతో డిల్లీ సర్కార్‌.. కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీకి అవసరమయ్యే 30 శాతం పవర్‌ను దాద్రి-2, ఊంచహార్‌ ప్లాంట్‌ల నుంచి ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం వాటిలో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. అవి పని చేయడం ఆగిపోతాయని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మెట్రో రైళ్లతో పాటు ఆస్పత్రుల్లోనూ కరెంట్‌ సరఫరా నిలిచిపోతుందటూ ఢిల్లీ సర్కార్‌ ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top