నీట్ సహా ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించాలి
ప్రతి జిల్లాలో ప్రభుత్వ పరీక్షా కేంద్రం.. బ్లాక్‌లిస్ట్ సంస్థల జాతీయ రిజిస్ట్రీ
పార్లమెంటరీ కమిటీ నివేదికలో కీలక సిఫార్సులు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను పార్లమెంటుకు జవాబుదారీగా ఉండేలా తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. నిర్వహణలో విశ్వసనీయత, పారదర్శకత అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు, స్థానిక సంస్థల మధ్య సమన్వయం అవసరమని ఎంతో ఉందని పేర్కొంది.
నీట్ (యూజీ), జేఈఈ మెయిన్స్, యూజీసీ నెట్, సీయూఈటీ వంటి పరీక్షల నిర్వహణలో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకురావాలని సూచించింది. నీట్‌ను దశలవారీగా కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలోకి మార్చడం, ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు విస్తృత ప్రశ్నల బ్యాంకును రూపొందించడం, ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి అవసరమని పేర్కొంది.
రాజ్యసభ ఎంపీ ముకుల్ వాస్నిక్ అధ్యక్షతన ఉన్న విద్య, మహిళలు, పిల్లలు, యువజన, క్రీడల శాఖకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు నివేదికను శుక్రవారం రాజ్యసభ ఛైర్మన్‌కు సమరి్పంచింది. ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సూచించిన వెయ్యి ప్రభుత్వ కంప్యూటర్ ఆధారిత పరీక్షా కేంద్రాల ఏర్పాటును నిర్దిష్ట గడువుతో అమలు చేయాలని సిఫార్సు చేసింది.
కనీసం జిల్లాకో పరీక్షా కేంద్రం ఉండాలని, విద్యార్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు నమూనా పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అదేవిధంగా, ఎన్టీఏలో మంజూరైన 39 పోస్టులకుగాను 23 మంది అధికారులు మాత్రమే పనిచేస్తున్నారని కమిటీ వెల్లడించింది. పరీక్షల నిర్వహణలో అనుభవం, ప్రత్యేక నైపుణ్యాలున్న వారితో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని సూచించింది.
ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అవకాశం
పరీక్షా కేంద్రాలకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న విద్యార్థులకు పూర్తిగా ప్రవేశం నిరాకరించే విధానంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆలస్యానికి గల కారణాలను నమోదు చేస్తూ, విద్యార్థుల నుంచి అంగీకార పత్రం తీసుకొని పరీక్ష రాసేందుకు అనుమతించే విధానాన్ని రూపొందించాలని సూచించింది. అయితే వారికి అదనపు సమయం ఇవ్వకూడదని స్పష్టం చేసింది. పరీక్ష సమయంలోనే సంతకాలు, ఇతర తనిఖీ ప్రక్రియలు నిర్వహించడం వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోందని, ఇలాంటి వాటిరి పరీక్షకు ముందు లేదా తర్వాత ప్రత్యేకంగా 15 నిమిషాల సమయాన్ని కేటాయించాలని సిఫార్సు చేసింది.
కోచింగ్ సెంటర్లపై నియంత్రణ
ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా, పరీక్షల నిర్వహణకు సంబంధించిన సేవల్లో నిషేధానికి గురైన కొన్ని సంస్థలు ఇతర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాల్లోనూ ఒప్పందాలు పొందుతున్నాయని కమిటీ గుర్తించింది. దీనిని నిరోధించేందుకు బ్లాక్‌లిస్ట్ చేసిన సంస్థలు, వాటికి సంబంధించిన వ్యక్తులు, అనర్హతకు కారణాలు, చర్యలు తీసుకున్న సంస్థల వివరాలతో జాతీయ రిజిస్ట్రీ ఏర్పాటు చేయాలని సూచించింది. కోచింగ్ పరిశ్రమకు సంబంధించి ఫీజుల పారదర్శకత, భద్రతా ప్రమాణాలు, విద్యార్థుల మానసిక ఆరోగ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
రెండు దశల్లో వైద్య ప్రవేశ పరీక్షలు
నీట్ యూజీ ద్వారా అర్హత సాధిస్తున్న అభ్యర్థుల సంఖ్యకు, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయు‹Ù, నర్సింగ్ కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్లకు మధ్య అంతరం ఉందని కమిటీ పేర్కొంది. అర్హత కటాఫ్, పర్సంటైల్ విధానాన్ని ఏటా సమీక్షించి, సీట్ల లభ్యతకు అనుగుణంగా అర్హుల సంఖ్యను సమతుల్యం చేయాలని సూచించింది.భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు రెండు దశల విధానం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పేర్కొంది. వైద్య సంబంధిత కోర్సులన్నింటికీ ఉమ్మడి ప్రాథమిక పరీక్ష నిర్వహించి, నిర్దిష్ట కోర్సులకు ప్రత్యేక ప్రధాన పరీక్ష నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలని తెలిపింది. అలాగే అభ్యర్థుల వయోపరిమితి, ప్రయత్నాల సంఖ్యపై తగిన పరిమితులు విధించే అంశాన్ని సంబంధిత శాఖలు, నిపుణులతో చర్చించి పరిశీలించాలని సూచించింది.
ఫిర్యాదులకు స్వతంత్ర వ్యవస్థ
పరీక్షల్లో పాల్గొనే విద్యార్థుల రాష్ట్రం, లింగం, పాఠశాల విద్యా బోర్డు, బోధనా మాధ్యమం, సామాజిక వర్గం ఆధారంగా నమోదు, ఉత్తీర్ణత, కటాఫ్ సాధన వివరాలను విశ్లేషించే వార్షిక ఈక్విటీ ఆడిట్ నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. పరీక్షలు పరిపాలనా కారణాలతో రద్దయినప్పుడు ప్రభావిత అభ్యర్థులకు పరిహారం అందించే అంశాన్ని పరిశీలించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి గడువులు నిర్ణయించాలని తెలిపింది. పరీక్షల భద్రతా విధానాలను ఆడిట్ చేయడానికి, విద్యార్థుల ఫిర్యాదులను విచారించడానికి ఎన్టీఏకు స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దివ్యాంగ విద్యార్థులకు అందుబాటులో ఉండే పరీక్షా కేంద్రాలు, అవసరమైన సహాయకులు, అదనపు సమయం, ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కల్పించాలని సిఫార్సు చేసింది.


