► కొకనట్ డెవలప్‌మెంట్ బోర్డు సవరణ బిల్లు 2021 ఆమోదం పొందిన వెంటనే లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
►విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ రేపటి వరకు వాయిదా పడింది.
►ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో మధ్యాహ్నాం రెండు గంటల వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
►రాజ్యసభలో విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వెల్‌లోకి దూసుకొచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో రూల్ 225 ప్రకారం ఆరుగురు టీఎంసీ ఎంపీలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు.
► పోలవరంపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో వాయిదా తీర్మానం చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్పీకర్‌కు నోటీసు అందజేశారు. పోలవరం సవరించిన అంచనాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
► పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేస్తున్నారు. దీంతో లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం నెలకొంది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 12వ రోజుకు చేరుకున్నాయి. అయితే, బుధవారం ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది సేపటికే పెగసస్ వేడి మరోసారి రాజుకుంది. పెగసస్‌పై చర్చకోసం ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై చర్చ, వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
