అట్టుడికిన పార్లమెంటు

Parliament adjourned after Opposition MPs protest against Rahul gandi disqualification - Sakshi

న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు మొదలుకుని పలు అంశాలపై పార్లమెంటు సోమవారం అట్టుడికిపోయింది. విపక్ష సభ్యుల ఆందోళనలు, డిమాండ్లు, నినాదాలతో ఉభయ సభలూ దద్దరిల్లాయి. పెద్దగా ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకుండానే మరోసారి వాయిదాపడ్డాయి. ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభ ఉదయం సమావేశమవుతూనే కాంగ్రెస్, విపక్ష సభ్యులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేబూని నినాదాలతో హోరెత్తించారు.

అదానీ అవకతవకలపై జేపీసీ దర్యాప్తు కోరుతూ వెల్‌లోకి దూసుకెళ్లారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులు స్పీకర్‌ కుర్చీపైకి కాగితాలు విసిరారు! సభాధ్యక్షులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దాంతో ఉభయ సభలూ మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాహుల్‌పై వేటును నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్ష సభ్యులంతా నల్ల దుస్తులు ధరించి సభలకు హాజరయ్యారు. అంతకుముందు ఈ అంశంపై వ్యూహరచనకు కాంగ్రెస్‌ సారథ్యంలో విపక్షాలన్నీ సమావేశమై చర్చించాయి.

ఆర్థిక బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఎలాంటి చర్చలూ చేపట్టకుండానే ఆర్థిక బిల్లు–2023ను, జమ్మూ కశ్మీర్‌ బడ్జెట్, పలు ఇతర బిల్లులను రాజ్యసభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించి లోక్‌సభకు తిప్పి పంపింది. సభలో విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీటిపై చర్చకు 10 గంటల సమయాన్ని సభ్యులు వినియోగించుకోలేదంటూ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఆవేదన వెలిబుచ్చారు. గత వారం లోక్‌సభ కూడా ఈ బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించడం తెలిసిందే.

మోదీకి ఎందుకంత భయం?
‘‘ప్రధాని మోదీ జీ! ప్రజల రిటైర్మెంట్‌ నిధులను అదానీ గ్రూప్‌లో ఎందుకు పెట్టుబడులుగా పెట్టాల్సి వచ్చిందన్న విపక్షాల ప్రశ్నలకు మీ నుంచి సమాధానం లేదు. అదానీ గ్రూప్‌ అవకతవకలపై విచారణ లేదు. మీకెందుకంత భయం?’’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ‘‘మోదీ–అదానీ బంధం బయటపడ్డాక కూడా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులన్నింటినీ అదానీ సంస్థల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది?’’ అంటూ సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్‌కు తృణమూల్‌ బాసట
కొన్నాళ్లుగా కాంగ్రెస్‌తో ఉప్పూనిప్పుగా ఉంటున్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఆ పార్టీకి సంఘీభావం ప్రకటించింది. లోక్‌సభ నుంచి రాహుల్‌ను అనర్హునిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన వ్యూహరచన భేటీలోనూ, అదానీ ఉదంతంపై జరిగిన నిరసనల్లోనూ పాల్గొంది. తృణమూల్‌ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, శివసేన (యూబీటీ)తో సహా మొత్తం 16 విపక్షాలు వీటిలో పాల్గొన్నాయి. తమ మద్దతు కేవలం రాహుల్‌ అంశానికే పరిమితమని అనంతరం తృణమూల్‌ స్పష్టత ఇచ్చింది. ‘‘పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు జరిపే ఆందోళనల్లో కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలతోనూ మేం కలిసి సాగుతాం. అదే సమయంలో పలు అంశాలపై కాంగ్రెస్‌తో తమ అభిప్రాయ భేదాల్లో ఏ మార్పూ లేదు’’ అని పేర్కొంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష కూటమికి తృణమూల్‌ కొంతకాలంగా దూరంగా ఉంటుండటం తెలిసిందే.

బంగ్లా ఖాళీ చేయండి
లోక్‌సభ సభ్యత్వం రద్దయిన నేపథ్యంలో అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ రాహుల్‌గాంధీకి తాఖీదులందాయి. ఎంపీ హోదాలో 12, తుగ్లక్‌ లేన్‌లో ఆయనకు కేటాయించిన బంగ్లాను ఏప్రిల్‌ 22కల్లా ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్‌ కమిటీ పేర్కొంది. అనర్హత వేటు పడ్డ ఎంపీలు నెలలోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని సీనియర్‌ అధికారి ఒకరు గుర్తు చేశారు. బంగ్లాలో మరింతకాలం ఉండాలనుకుంటే కమిటీకి రాహుల్‌ లేఖ రాయవచ్చన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top