ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు.. మధ్యాహ్న భోజనంలో చికెన్‌, పండ్లు

Panchayat Polls Bengal Decides To Serve Chicken Fruits In Mid Day Meals - Sakshi

లక్నో: పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార టీఎంసీ ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కొత్తగా చికెన్‌, సీజనల్‌ పండ్లు అందజేయాలని నిర్ణయింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురానుంది. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు నాలుగు నెలలపాటు వీటిని స్కూల్‌ పిల్లలకు అందజేయనున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్‌ డే మిల్‌లో భాగంగా బియ్యం, పప్పులు, కూరగాయలు, సోయాబీన్ ,గుడ్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మెనూలో అదనంగా  పీఎం పోషన్‌ కింద పోషకాహారం కోసం వారానికి ఒకసారి చికెన్, సీజనల్ పండ్లను అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం మమతా బెనర్జీ సర్కార్‌ అదనంగా రూ. 371 కోట్లను మంజూరు చేసింది.

జనవరి నుంచి అదనపు పౌష్టికాహార పథకం అమలులోకి వస్తోందని విద్యాశాఖ విభాగం అధికారి ఒకరు ధృవీకరించారు. అయితే  ఏప్రిల్ తర్వాత దీనిని కొనసాగించాలా వద్దా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రతి విద్యార్థికి అదనపు పోషకాహారాన్ని అందించడానికి వారానికి రూ. 20 ఖర్చు అవుతుందన్నారు. ఈ ప్రక్రియ 16 వారాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా రాష్ట్ర,ఎయిడెడ్ పాఠశాలల్లో 1.16 కోట్ల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్దిపొందుతున్నారు.  దీని కోసం రాష్ట్ర, కేంద్రం 60:40 నిష్పత్తిలో ఖర్చును పంచుకుంటాయి.

అయితే ఈ నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది, ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని బీజేపీ మండిపడింది.అయితే దీనిపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్‌.. ప్రతిపక్షాలు ప్రతిదానిలో చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించింది. మరోవైపు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన నిలుస్తారని టీఎంసీ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్ అన్నారు.
చదవండి: నెల రోజుల్లో రెండో ఘటన.. ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో మరో దారుణం ..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top