బంగాళాఖాతంలోకి పాక్‌ జలాంతర్గాములు! | Pakistan signals Bay of Bengal return with new China-built submarine | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలోకి పాక్‌ జలాంతర్గాములు!

Jun 19 2026 5:53 AM | Updated on Jun 19 2026 5:54 AM

Pakistan signals Bay of Bengal return with new China-built submarine

చైనా నుంచి కొనుగోలు చేసిన హంగోర్‌ సబ్‌మెరైన్లను 

మోహరించే యోచన బంగ్లాదేశ్‌ విమోచన 

యుద్ధం తర్వాత తొలిసారిగా బంగాళాఖాతంపై పాక్‌ కన్ను

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధం వేళ పాకిస్తాన్‌ నావికాదళాన్ని భారత్‌ దారుణంగా దెబ్బతీశాక బంగాళాఖాతం జలాల వైపు కన్నెత్తిచూడని పాకిస్తాన్‌ 55 సంవత్సరాల తర్వాత మళ్లీ బంగాళాఖాతం వైపు దృష్టిసారించింది. చైనా తయారీ హంగోర్‌ శ్రేణి జలాంతర్గామిని బంగాళాఖాతంలో నిఘా కోసం మొహరించాలని పాక్‌ యోచిస్తోంది. పీఎన్‌ఎస్‌ హంగోర్‌ జలాంతర్గామి ఇటీవలే కరాచీకి చేరుకుంది. అంతకుముందు చైనా నుంచి వస్తూ అంతర్జాతీయ సముద్రజలాల గుండా పయనిస్తూ ఈ జలాంతర్గామి శ్రీలంక సమీపంగా వచ్చింది.

ఈ జలాంతర్గామికి ఎస్కార్ట్‌గా వస్తున్న నౌకల కాన్వాయ్‌(ఫ్లోటిల్లా)కు కమాండర్‌ ఒమర్‌ ఫరూఖ్‌ కొలంబో పోర్ట్‌లో మాట్లాడారు. ‘‘అధునాతన హంగోర్‌ తరగతి జలాంతర్గామితో పాక్‌ ఇకపై సముద్రతలంలోనూ తన సత్తా చాటనుంది. బంగాళాఖాతంలో మా కార్యకలాపాలకు ఇది ఎంతో దోహదపడుతుంది. ఇది ఆట తీరును మార్చేసే గేమ్‌ ఛేంజర్‌. ఈ రకం ఎనిమిది జలాంతర్గాములను సమకూర్చుకోబోతున్నాం’’అని ఆయన వెల్లడించారు. అరేబియా సముద్రం దాటి బంగాళాఖాతం దాకా తమ నిఘా కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్నట్లు కమాండర్‌ చెప్పడంతో పాక్‌ కుయుక్తి బహిర్గతమైంది. 

బంగాళాఖాతం ఎందుకంత కీలకం? 
భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధం వేళ డయ్యూ పరిధిలో భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ ఖుక్రీని పాక్‌కు చెందిన పీఎన్‌ఎస్‌ హంగోర్‌ జలాంతర్గామి మూడు టార్పెడోలతో దాడిచేసి ముంచేసింది. అయినాసరే యుద్ధంపై దీని ప్రభావం ఏమాత్రం పడలేదు. భీకరంగా దాడిచేసిన భారత్‌ పాక్‌ పీచమణిచింది. అప్పట్నుంచి బంగాళాఖాతంలో పాక్‌ జలాంతర్గాముల సంచారమే లేదు. తాజాగా బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కూలడం, పాక్‌ అనుకూల ప్రభుత్వం కొలువుతీరడంతో దశాబ్దాల తర్వాత బంగాళాఖాతంపై పాక్‌ కన్నుపడింది. భౌగోళికంగా బంగాళాఖాతంపై భారత పట్టు అధికం.

అండమాన్‌ నికోబార్‌ దీవులు ఉండటంతో అక్కడి నుంచి సముద్రంలోపలికి 370 కిలోమీటర్లదాకా భారత ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ ఉంది. అక్కడిదాకా సముద్రజలాలపై సర్వాధికారం భారత్‌కే దఖలుపడుతోంది. ఉత్తర తీరం వైపే విశాఖపట్నంలో భారత నావికాదళ తూర్పు కమాండ్‌ ప్రధాన స్థావరం ఉంది. ఇదే బంగాళాఖాతం బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియాలకూ తీరప్రాంతంగా ఉంది.

అదీకాకుండా బంగాళాఖాతం అనేది భారత వస్తూత్పత్తులు, ఇంధన వాణిజ్యానికి, నౌకల రాకపోకలకు కీలక మార్గంగా మారింది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో పాక్‌ అడుగుపెట్టడం భారత నావికా, నిఘా కార్యకలాపాలకు అవరోధంగా మారే ఆస్కారముంది. పాక్‌ తన తీర ప్రాంతానికి సుదూరంగా హిందూ మహాసముద్రంలో బంగాళాఖాతంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తే భారత్‌కు ఎప్పుడూ తలనొప్పేనని యుద్దరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.  

సముద్ర జలాల్లో హంగోర్‌ జలాంతర్గామి  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement