బోర్డర్‌లో టెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ అదుపులో పాక్‌ సైనికుడు | Pak Soldier Detained By BSF In Rajasthan | Sakshi
Sakshi News home page

బోర్డర్‌లో టెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ అదుపులో పాక్‌ సైనికుడు

May 4 2025 7:23 AM | Updated on May 4 2025 10:17 AM

Pak Soldier Detained By BSF In Rajasthan

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దుల వద్ద పాక్‌ ఆర్మీ అధికారి ఒకరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు పట్టుబడ్డారు. అతడిని వెంటనే కస్టడీలోకి తీసుకున్నామని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. పదిహేను రోజుల క్రితం, ఏప్రిల్‌ 23న బీఎస్‌ఎఫ్‌ జవాను పూర్ణం కుమార్‌ పాక్‌ భూభాగంలోకి పొరపాటున ప్రవేశించి అక్కడి జవాన్లకు దొరికిపోవడం తెల్సిందే. భారత బలగాలు తీవ్ర నిరసన తెలిపినప్పటికీ ఆయన్ను తిరిగి అప్పగించేందుకు పాక్‌ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.   

ఇదిలా ఉండగా.. భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పదో రోజు కూడా దాయాది ఆర్మీ కాల్పులు జరిపింది. వాస్తవాధీన రేఖ వద్ద కుప్వారా, ఫూంచ్‌ర, అక్నూర్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌ ఆర్మీ కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపులకు దిగింది. దీంతో, భారత సైన్యం పాకిస్తాన్‌ కాల్పులను తిప్పికొట్టింది. ధీటుగా బదులిచ్చింది. 

రెచ్చగొట్టేలా పాక్‌ క్షిపణి పరీక్షలు..
మరోవైపు.. పహల్గాం ఉగ్ర దాడితో అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్న భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా పాక్‌ వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ క్షిపణి పరీక్షలకు దిగింది. 450 కి.మీ. రేంజ్‌తో కూడిన అబ్దాలీ సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు పాక్‌ సైన్యం శనివారం ప్రకటించుకుంది. పైగా, ఇది ‘సింధూ విన్యాసా’ల్లో భాగమంటూ గొప్పలకు పోయింది. ఇది అద్భుతమంటూ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఉదంతంపై భారత్‌ మండిపడింది. దీన్ని కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.  

Advertisement
 
Advertisement
Advertisement