
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు అంశం పట్ల రాజ్యసభలో అలజడి రేగింది. ప్రతిపక్ష సభ్యులు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వినేశ్ ఫోగాట్ అంశంపై సభలో చర్చించేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జగదీప్ ధన్‌ఖడ్ సభ నుంచి వెళ్లిపోయారు.
ఎగువ సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. వినేశ్ ఫోగాట్‌పై అనర్హత అంశంపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. అందుకు ధన్‌ఖడ్ అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు.
డెరెక్ ఓబ్రెయిన్‌తోపాటు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది. ఫోగాట్‌పై చర్చించేందుకు ధన్‌ఖడ్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. విపక్ష ఎంపీల తీరు పట్ల ధన్‌ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఉండలేనని చెప్పారు. భారమైన హృదయంతో సభ నుంచి నిష్కృమిస్తున్నానని తెలిపారు.