Odisha Train Accident:ఆ రూట్లో కవచ్‌ సిస్టమ్‌ లేదు, ప్రమాదానికి కారణం ఏంటో చెప్పిన రైల్వే శాఖ

Odisha Train Accident: Didnot Have Kavach System Rescue Ops Over - Sakshi

ఒడిశాలోని బాలాసోర్‌లో జ‌రిగిన భీక‌ర రైళ్ల ప్ర‌మాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ప్రమాదానికి సిగ్నల్‌ ఫెయిల్యూరే కారణమని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒడిశా రైలు ప్రమాదంపై ప్రాథమిక నివేదికను నిపుణుల బృందం రైల్వే శాఖకు అందించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్‌ లైన్‌లోకి తప్పుగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ఈ నివేదికలో వెల్లడైంది.

సిగ్నల్‌ ఫెయిల్యూర్‌ కారణంగానే ప్రమాదం
చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్‌ లభించకపోవడంతో ప్రమాదం జరిగిందని తేలింది. మొదట సిగ్నల్‌ ఇచ్చినా ఆ తరువాత దానిని ఆపేశారని, దీంతో కోరమండల్‌ రాంగ్‌ ట్రాక్‌పైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మెయిన్‌లైన్‌ బదులు లూప్‌లైన్‌లోకి వెళ్లడంతో.. లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌ను రైలును కోరమాండల్‌ ఢీకొట్టి పట్టాలు తప్పిందని నిపుణుల బృందం తేల్చింది.

దీని బోగీలు పక్క ట్రాక్‌పైన పడగా..  అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ వీటిని ఢీకొట్టింది. దీంతో ఈ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయని అని రైల్వే శాఖ తమ నివేదికలో వెల్లడించింది.  కాగా శుక్రవారం ఒడిశా బాలాసోర్‌ వద్ద ప్రమాదానికి గురై కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటన పెను విషాదానికి కారణమైన విషయం తెలిసిందే. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. 

ముగిసిన సహాయక చర్యలు : రైల్వే శాఖ
ఒడిశా రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్‌ శర్మ తెలిపారు. రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ప్రమాదం జరిగిన బాలాసోర్‌ మార్గంలో కవచ్‌ వ్యవస్థ లేదని ఆయన తెలిపారు. దాని వల్లే ప్ర‌మాదం తీవ్రత అధికంగా మారిందని పేర్కొన్నారు.

ఆ రూట్లో కవచ్‌ సిస్టమ్‌ లేదు
ప్ర‌స్తుతం రెస్క్యూ ఆప‌రేష‌న్ ముగిసింద‌ని, ఇక రైల్వే లైన్ పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు మొద‌లుపెడుతున్నామ‌ని, ప్ర‌మాదం జ‌రిగిన రూట్లో క‌వ‌చ్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ లేద‌ని తెలిపారు. కాగా రైలు ప్ర‌మాదాల‌ను నివారించేందుకు దేశ‌వ్యాప్తంగా క‌వ‌చ్ వ్య‌వ‌స్థ‌ను భారత రైల్వేశాఖ డెవలప్‌ చేస్తోంది. కవచ్‌ అనేది ఆటోమెటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌. దీనిని మూడు భారతీయ సంస్థలతో కలిసి రిసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్స్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సమయానికి బ్రేక్‌ వేయడంలో డ్రైవర్‌ ఫెయిల్‌ అయితే కవచ్‌ సిస్టమర్‌ రైలు వేగాన్ని ఆటోమెటిక్‌గా నియంత్రిస్తుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top