యడ్యూరప్పపై అరెస్టు వారెంట్‌ | Non-bailable warrant against BS Yediyurappa in a POCSO case | Sakshi
Sakshi News home page

యడ్యూరప్పపై అరెస్టు వారెంట్‌

Published Fri, Jun 14 2024 5:14 AM | Last Updated on Fri, Jun 14 2024 5:14 AM

Non-bailable warrant against BS Yediyurappa in a POCSO case

పోక్సో కేసులో జారీ చేసిన బెంగళూరు కోర్టు  

సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందన్న కర్ణాటక హోంమంత్రి  

బెంగళూరు:  లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం(పోక్సో) కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూరప్ప(81)పై బెంగళూరు కోర్టు గురువారం నాన్‌–బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే ఆయనకు సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ, యడ్యూరప్ప హాజరు కాకపోవడంతో సీఐడీ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. 

దీంతో కోర్టు నాన్‌–బెయిలబుల్‌ అరెస్టు వారెంటు జారీ చేసింది. యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, తిరిగివచి్చన తర్వాత సీఐడీ ఎదుట హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అకృత్యానికి  పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐసీసీ సెక్షన్‌ 354 కింద ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరు సదాశివనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే కర్ణాటక డీజీపీ ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తనపై వచి్చన ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు.

 ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. యడ్యూరప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ గత నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు అంతకుముందే రికార్డు చేశారు. పోక్సో కేసులో యడ్యూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు. దీనిపై సీఐడీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement