
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు రెండు రోజులుగా కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసు మహారాష్ట్రలో కీలక పరిణామాలకు దారి తీసింది. ఏకంగా ప్రభుత్వంలో ఓ భారీ కుదుపు ఏర్పడింది. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నెలకు రూ.వంద కోట్లు వసూల్ లక్క్ష్యంగా పెట్టుకున్నారని ఓ మాజీ పోలీస్ అధికారి చేసిన ఆరోపణలపై కథ నడుస్తోంది. దీనిపై తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ విషయంలో తమకు శివసేన నుంచి ఎలాంటి ఒత్తిడులు రావడం లేదని శరద్ పవార్ తెలిపారు. హోంమంత్రిపై ఆరోపణలు చేసిన పరమ్‌వీర్ సింగ్ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కరోనాతో ఆస్పత్రిలో ఉన్న అనిల్ దేశ్‌ముఖ్‌తో ఎలా చర్చించారని ప్రశ్నించారు. ఆస్పత్రిలో ఉన్న వ్యక్తిపై నిరాధార ఆరోపణలు చేశారని శరద్ పవార్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా అంశం ప్రస్తావనకు రాలేదు అని శరద్ పవార్ తెలిపారు. అనిల్ ఆస్పత్రిలో ఉన్నాడని నిరూపించేందుకు అన్ని రికార్డ్‌లు ముఖ్యమంత్రికి పంపుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో అతడి రాజీనామా ప్రస్తావన అవసరమే లేదు అని పవార్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. హోంమంత్రిగా ఉన్న అనిల్ దేశ్‌ముఖ్ ఎన్సీపీకి చెందిన వ్యక్తి. దీంతో దీనిపై శరద్ పవార్ వివరణ ఇచ్చారు.
చదవండి: మళ్లీ అక్కడే మరో మృతదేహం