‘సోనియా జీ’ మీరు కూడా మహిళే కదా: నిర్మలా సీతారామన్‌ ఫైర్‌

Nirmala Sitharaman Demands Sonia Gandhi Must Apologise - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. రాష్ట్రపతిని కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ డిమాండ్‌ చేశారు.

అనంతరం.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అధినేత్రి  విరుచుకుప‌డ్డారు. త‌న‌తో మాట్లాడ‌వ‌ద్ద‌ని మండిప‌డ్డారు. మ‌ద్యాహ్నం 12 గంట‌ల‌కు లోక్‌స‌భ వాయిదా ప‌డిన స‌మ‌యంలో బీజేపీ నేత ర‌మాదేవితో సోనియా మాట్లాడుతుండ‌గా వారి సంభాష‌ణ‌లో స్మృతి ఇరానీ క‌ల్పించుకున్నారు. ఆపై ఆగ్ర‌హంతో ఊగిపోయిన సోనియా.. స్మృతి ఇరానీ వైపు తిరిగి త‌న‌తో మాట్లాడ‌వ‌ద్ద‌ని అన్న‌ట్టు స‌మాచారం. ఇక అదీర్ వ్యాఖ్య‌ల‌పై అంత‌కుముందు  స్మృతి ఇరానీ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు.

అంతకుముందు, ఉభయ సభల్లో బీజేపీ ఎంపీలో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. దీంతో, లోక్‌సభకు సాయంత్రం 4 గంటల వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు.. అధిర్‌ రంజన్‌ చౌదరి.. రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ‘రాష్ట్రపత్ని’ అంటూ  అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలో సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ స్మృతి ఇరానీ ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళను అవమానించడాన్ని సోనియా గాంధీ ఆమోదించారని మండిపడ్డారు. సోనియా గాంధీ.. ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, స్త్రీ వ్యతిరేకి అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు.

కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం సోనియాగాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు సోనియా గాంధీ ఇచ్చిన స్వేచ్ఛ కారణంగానే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇందుకు సోనియా గాంధీ తప్పకుండా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఇది నోరు జారి అన్న మాట కాదు.. ఒక్కసారి కాదు.. పదే పదే రాష్ట్రపతి పదం వాడారని తెలిపారు. 

ఇక, ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు తప్పే అని అధిర్‌ రంజన్‌ ఒప్పుకున్నా.. వ్యవహారం చల్లారలేదు. ‘తన ‍వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

  

ఇది కూడా చదవండి: ‘రాష్ట్రపతి కాదు.. రాష్ట్రపత్ని’.. కాంగ్రెస్‌ నేత కామెంట్లపై దద్దరిల్లిన లోక్‌సభ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top