Druapadi Murmu: ‘రాష్ట్రపతి కాదు.. రాష్ట్రపత్ని’.. కాంగ్రెస్‌ నేత కామెంట్లపై దద్దరిల్లిన లోక్‌సభ

BJP Protests Against Congress Rashtrapatni Comment On Druapadi Murmu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. లోక్‌సభలో బీజేపీ ఆందోళన చేపట్టింది.  రాష్ట్రపతిని కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గురువారం లోక్‌సభలో గళం వినిపించారు. 

రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. ఈ కామెంట్లపై అధికార బీజేపీ భగ్గుమంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్‌ అవమానించింది. కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణలు చెప్పాల్సిందే అని స్మృతి ఇరానీ మండిపడ్డారు. 

తన వ్యాఖ్యలు తప్పే అని అధిర్‌ రంజన్‌ ఒప్పుకున్నా.. వ్యవహారం చల్లారలేదు. ‘తన ‍వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ’ ఆవేశంగా మాట్లాడారాయన. ఇప్పటికే అధిర్‌ రంజన్‌ క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వివరణ ఇచ్చినా.. అధికార పక్షం శాంతించలేదు.

దేశ అత్యున్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తిని అవమానించేందుకు సోనియా గాంధీ తన సభ్యులకు అనుమతి ఇచ్చినట్లు అయ్యిందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఈ క్రమంలో ఒకానొక టైంలో బీజేపీ సభ్యులంతా లేచి.. స్మృతి ఇరానీకి మద్ధతుగా గళం వినిపించారు. ఈ గందరగోళం నడుమే లోక్‌సభ 12 గం. దాకా వాయిదా పడింది.

పార్లమెంట్‌ ఆవరణలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన తోటి ఎంపీలతో కలిసి ఫ్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. అధిర్‌ రంజన్‌వి సెక్సీయెస్ట్‌ కామెంట్లు అని, ఇది  గిరిజన బిడ్డకు జరిగిన అవమానం అంటూ ఆమె పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top