దేశ నిర్మాణమనే మహాయజ్ఞంలో... ఎన్‌ఈపీది కీలక భూమిక

New NEP major factor in mahayagna of nation building - Sakshi

కొత్త విద్యా విధానానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మోదీ

న్యూఢిల్లీ: దేశ నిర్మాణమనే మహాయజ్ఞంలో కీలక భూమిక పోషిస్తున్న వాటిలో నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యువత తమ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి దేశం వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎన్‌ఈపీని అమలు చేయడానికి టీచర్లు, ప్రిన్సిపాల్స్, విధాననిర్ణేతలు తీవ్రంగా శ్రమించారని కితాబిచ్చారు.

‘భవిష్యత్తులో ఎంత ఉన్నత స్థాయికి చేరుకుంటామనేది ప్రస్తుతం యువతకు మనమెలాంటి విద్యను అందిస్తున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. దేశం మొత్తం మీతో ఉందని, మీ ఆకాంక్షలకు అండగా నిలుస్తుందనే భరోసాను కొత్త ఎన్‌ఈపీ యువతకు ఇస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. గురువారం కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (కృత్రిమ మేధ– ఏఐ) కార్యక్రమం యువతను భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా తీర్చిదిద్దుతుందని, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బాటలు వేస్తుందని అన్నారు.

  ఆకడమిక్‌ బ్యాంక్‌ ఆప్‌ క్రెడిట్‌ (ఏబీసీ) పథకాన్ని ప్రధాని ప్రకటించారు. దీని ప్రకారం ఉన్నతవిద్యలో ఒక విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. భిన్న యూనివర్శిటీలకు మారొచ్చు. వరుసగా ఇన్నేళ్లు చదవాలని కాకుండా... తను కోరుకున్నపుడు కోర్సులో చేరడం, మధ్యలో నిలిపివేయడం చేయవచ్చు. అతని రికార్డులన్నీ ఏబీసీలో నిక్షిప్తమవుతాయి. అలాగే 3, 5, 8వ తరగతుల విద్యార్థులకు సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టిన సమర్థత ఆధారిత మూల్యాంకనం (సఫల్‌)ను గురువారం మోదీ ఆరంభించారు.  

మాతృభాషకు పెద్దపీట
మాతృభాషకు, ప్రాంతీయ భాషలకు కూడా ఎన్‌ఈపీ ప్రాధాన్యమిస్తోందనే అంశాన్ని ఎత్తిచూపుతూ... ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఐదు భారతీయ భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ) విద్యాబోధనను ప్రారంభించనుండటం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇంజనీరింగ్‌ పాఠ్యాంశాలను 11 భాషల్లోకి అనువదించడానికి ఒక టూల్‌ను అభివృద్ధి చేయడం జరిగింది. మాతృభాషలో చదువుల కు ప్రాధాన్యమిస్తే... పేద, గ్రామీణ, గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపగలం. భారత సంకేత భాషకు తొలిసారిగా భాష హోదా ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఎవరైనా తాము నేర్చుకునే భాషల్లో ఒకటిగా దీన్ని ఎంచుకోవచ్చు’ అని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top