వ్యవసాయ బిల్లులపై రైతులతో రాహుల్‌ ‘కిసాన్‌ కీ బాత్‌’

On New Farm Laws Rahul Gandhi Holds Kisaan Ki Baat with Farmers - Sakshi

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లులతో రైతాంగానికి తీవ్ర నష్టం తప్పదని పేర్కొంటూ ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా కాంగ్రెస్‌ సహా వివిధ ప్రతిపక్ష పార్టీలు ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో ఈ బిల్లులపై సంభాషించారు. ఈ చట్టాల వల్ల రైతులు దోపిడీకి గురవుతారని.. వీటిని ‘నల్ల చట్టాలు’ అంటూ విమర్శించారు. ‘కిసాన్‌ కి బాత్’‌ పేరిట జరిగిన ఈ వర్చువల్‌ సంభాషణలో పంజాబ్‌, హరియాణా, బిహార్‌, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల నుంచి పది మంది రైతులు పాల్గొన్నారు. ఈ సంభాషణలో రాహుల్‌ గాంధీ ఈ చట్టం రైతులకు ఏ విధంగా హాని కలిగిస్తుందో చెప్పాలని వారిని కోరారు. దాంతో బిహార్‌కు చెందిన ధీరేంద్ర కుమార్‌ అనే రైతు మాట్లాడుతూ.. ‘ఈ చట్టాలు పూర్తిగా నల్ల చట్టాలు. వీటి వల్ల రైతులు దోపిడీకి గురవుతారు. ఆత్మహత్యలు పెరుగుతాయి’ అని తెలిపారు. కనీస మద్దతు ధర విషయం గురించి రైతులు ఎందుకు భయపడుతున్నారని రాహుల్‌ ప్రశ్నించిగా.. దీన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటారు. రైతులను మోసం చేస్తున్నారు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: కొత్త సాగు చట్టాలు వద్దు)

మహారాష్ట్రకు చెందిన గజనన్‌ కాశీనాథ్‌ అనే రైతు మాట్లాడుతూ.. ‘నేను కరోనా వైరస్‌ కంటే ఎక్కువగా ఈ చట్టాలకు భయపడుతున్నాను. నా భూమి నా తరువాతి తరం వారికి ఉంటుందా అనే అనుమానం తలెత్తుతుంది’ అన్నారు. ఇక రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. తన మొదటి పెద్ద పోరాటం భూ సేకరణపై జరగిందని 2011 ఉత్తరప్రదేశ్‌ భట్టా పార్సౌల్‌లో అరెస్ట్‌ చేయడాన్ని ప్రస్తావించారు. నాటి ఘటనలో తనపై దాడి జరిగిందని.. అయితే తాను దాన్ని ఎదుర్కున్నాను అని తెలిపారు. ఇక కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు, నోట్ల రద్దు, జీఎస్టీకి పెద్ద తేడా లేదన్నారు. ఈ చట్టాలు రైతు హృదయంలో కత్తిపోటు లాంటివంటూ రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top