Delhi MCD Poll Results: ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలి.. ఢిల్లీ విజయంపై అరవింద్‌ కేజ్రీవాల్‌

Need PM Blessing: Arvind Kejriwal After AAP Wins MCD Polls - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు, కేంద్రం సహకారం అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేయడానికి బీజేపీ, కాంగ్రెస్‌ సహకారాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. ఈమేరకు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు.

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు ఢిల్లీ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎంసీడీలో ఆప్‌ విజయం రాజధానిలో తొలిసారి డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని అందించిందన్నారు. మనమందరం కలిసి ఢిల్లీ నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఎంసీడీని అవినీతి రహితంగా మార్చేందుకు అన్ని పార్టీలు, అభ్యర్థులు కలిసి పనిచేయాలని సూచించారు.
చదవండి: కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాల భేటీకి హాజరై షాకిచ్చిన ఆ రెండు పార్టీలు

మరోవైపు ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయంపై ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా స్పందించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీపై విశ్వాసం చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదని.. పెద్ద బాద్యత అని వ్యాఖ్యానించారు. ప్రజలతో తీర్పుతో అతిపెద్ద పార్టీని ఓడించగలిగామని అన్నారు. 

కాగా బుధవారం వెల్లడైన మున్సిపల్‌ ఫలితాల్లో ఆప్‌ విజయ దుందుభి మోగించింది. మొత్తం 250 వార్డులు ఉండగా మెజార్జీ మార్క్‌(126)ను దాటి 134 స్థానాలను కైవసం చేసుకుంది. ఆప్‌ విజయంతో ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు ఆమ్‌ ఆద్మీ పార్టీ గండికొట్టింది. దీంతో ఢిల్లీ మేయర్‌ పదవి ఆప్‌ వశమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 104 వార్డుల్లో గెలుపొందగా.. కాంగ్రెస్‌ కేవలం 9 స్థానలకే పరిమితమైంది. మరో మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు.
చదవండి: గుజరాత్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్‌ పోల్స్‌ తారుమారు

ఇక  ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఆమ్‌ ఆద్మీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల వద్ద ఆప్‌ నేతలు, కార్యకర్తలు  సంబరాలు చేసుకుంటున్నారు.  పూలు చల్లుతూ, స్వీట్లు పంచుకుంటూ  ఆనందంతో డ్యాన్స్‌లు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top