ప్రతి ఆరుగురిలో ఒకరికి తీవ్ర మానసిక ఒత్తిడి
చదువు, పరీక్షల భయం ఒకవైపు...కుటుంబ పెద్దల వ్యసనాలు మరోవైపు
ఆత్మహత్యల బాధితుల్లో 7.6 శాతం మంది విద్యార్థులు
కౌన్సెలింగ్ ఉంటుందనే కనీస అవగాహనలేని దైన్యం
ఎయిమ్స్ ఆధ్వర్యంలో హరియాణాలోని టీనేజర్లపై అధ్యయనం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఆరుగురు టీనేజర్లలో ఒకరు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్’సర్వే వెల్లడించింది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో హరియాణాలోని 28 గ్రామాలకు చెందిన 583 మంది టీనేజర్లపై జరిగిన అధ్యయనంలో ఈ దిగ్భ్రాతికరమైన విషయాలు వెలుగుచూశాయి.
ఒత్తిడికి ప్రధాన కారణాలు
చదువు, పరీక్షల భయంతోపాటు తక్కువ మార్కులు వస్తాయనే ఆందోళన, మరోవైపు ఫెయిల్ అవుతామనే భయం, భవిష్యత్‌పై అభద్రతా భావం. వీటితోపాటు కుటుంబ సమస్యలు, ఇంట్లో తల్లిదండ్రుల గొడవలు, శారీరక లేదా మానసిక వేధింపులు. కుటుంబ పెద్దల వ్యసనాల కారణంగా ఒత్తిడికి గురైనట్టు తేలింది. సర్వేలో పాల్గొన్న 57 శాతం మంది టీనేజర్లు తమ ఇంట్లో పెద్దవారు మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు బానిసలైనట్టు తెలిపారు. ఇవేకాకుండా పేదరికం వల్ల అబ్బాయిలు చదువు మానేసి కూలి పనులకు వెళ్తుంటే.. భద్రతా కారణాలు, సామాజిక ఆంక్షల వల్ల అమ్మాయిల చదువు మధ్యలోనే ఆగిపోతోంది. స్కూళ్లలో లేదా బయట జరిగే అవమానాలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.
నిశ్శబ్దంగా నరకం.. అవగాహనా రాహిత్యం!
ఈ సర్వేలో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏంటంటే.. చాలామంది టీనేజర్లు తమ బాధను, ఆత్మహత్యా ఆలోచనలను ‘జీవితంలో ఒక భాగం’గా భావిస్తూ భరిస్తున్నారు. మానసిక సమస్యలకు చికిత్స లేదా కౌన్సెలింగ్ ఉంటుందనే కనీస అవగాహన కూడా వారికి లేదు. సమాజంలో ఎక్కడ అవమానం జరుగుతుందోననే భయంతో లోలోపలే కుమిలిపోతున్నారు.
గణాంకాలు ఇలా: ఎన్‌సీఆర్‌బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) నివేదిక ప్రకారం దేశంలో జరిగే మొత్తం ఆత్మహత్యల్లో 6 శాతం 18 ఏళ్ల లోపు పిల్లలవే. మొత్తం ఆత్మహత్యల బాధితుల్లో 7.6 శాతం మంది విద్యార్థులు ఉన్నారు.
అందుబాటులో లేని చికిత్స: భారతదేశంలో మానసిక ఆరోగ్య చికిత్సకు సంబంధించిన లోటు 83 శాతంగా ఉంది. అంటే సమస్య ఉన్న మెజారిటీ ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు.
నిపుణుల సూచనలు: చిన్న వయసులోనే వచ్చే మానసిక సమస్యలను పట్టించుకోకపోతే, అవి వారు పెద్దయ్యాక కూడా వెంటాడుతాయని, కాబట్టి తక్షణమే జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు.
స్కూల్ కౌన్సెలింగ్: ప్రతి పాఠశాలలోనూ పిల్లల సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి.
ఉపాధ్యాయులకు శిక్షణ: పిల్లల్లో మారుతున్న ప్రవర్తనను, ఒత్తిడిని గుర్తించేలా టీచర్లకు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలి.
టెలి–మానస్ వినియోగం: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ సేవలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి.


