ఆర్యన్‌ కేసులో బీజేపీ హస్తం!

NCP Alleges BJP Links In Mumbai Cruise Drugs Bust Case - Sakshi

ఎన్‌సీపీ మంత్రి నవాబ్‌ మాలిక్‌

రైడ్‌లో బీజేపీ కార్యకర్త ఉన్నాడని ఆరోపణ

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌కిడ్‌ ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు కేసు విషయం పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు అంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమని, సోదాల్లో ఎన్‌సీబీ అధికారులతో పాటు బీజేపీ నేత ఒకరు పాల్గొన్నారని నేషనలిస్టు కాంగ్రెస్‌ పారీ్టకి చెందిన మహారాష్ట్ర మైనార్టీ వ్యవహరాల మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరోపించారు. మరోవైపు ఎన్‌సీబీ, బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో ఆర్యన్‌తో సహా 17మందిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది.

జాతీయ నార్కొటిక్‌ బ్యూరో జరిపిన ఈ సోదాలన్నీ డ్రామాలని, నకిలీవని నవాబ్‌ మాలిక్‌ విమర్శించారు. అసలా నౌకలో డ్రగ్సే దొరకలేదన్నారు. ఈ సందర్భంగా రైడ్‌ జరుగుతున్నప్పటి కొన్ని వీడియోలను ఆయన విడుదల చేశారు. ఇందులోని ఒక వీడియోలో ఆర్యన్‌ను ఎస్కార్ట్‌ చేస్తూ గోస్వామి అనే వ్యక్తి కనిపించారు. అయితే అతను ఎన్‌సీబీ అధికారి కాదని, గోస్వామి సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ ప్రకారం అతను ఒక ప్రైవేట్‌ డిటెక్టివని నవాబ్‌ ఆరోపించారు. మరో వీడియోలో ఇదే కేసులో అరెస్టయిన అర్బాజ్‌ మర్చెంట్‌ను ఇద్దరు ఎస్కార్ట్‌ చేస్తూ కనిపించారు. వీరిలో ఒక వ్యక్తి బీజేపీ సభ్యుడని నవాబ్‌ చెప్పారు.

వీరంతా ఎన్‌సీబీ అధికారులు కానప్పుడు రైడ్‌లో ఎందుకున్నారని ప్రశ్నించారు. మర్చంట్‌తో పాటు ఉన్న వ్యక్తి గుజరాత్‌లో సెపె్టంబర్‌ 21–22 తారీకుల్లో కనిపించాడని, అందువల్ల అతనికి ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్‌తో సంబంధం ఉండి ఉండొచ్చని ఆరోపించారు. సదరు వ్యక్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. బాలీవుడ్‌ను, తమ ప్రభుత్వాన్ని మకిలిపట్టించేందుకు ఎన్‌సీబీని బీజేపీ ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. నవాబ్‌ అల్లుడు సమీర్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ డ్రగ్స్‌ కేసులో గత జనవరిలో అరెస్టు చేయగా, సెపె్టంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చారు.  

అవును.. అక్కడే ఉన్నాను: నౌకలో ఎన్‌సీబీ సోదాలు జరిపినప్పుడు తాను అక్కడే ఉన్నానని మాలిక్‌ ఆరోపణల్లో కేంద్రబిందువుగా మారిన మనీశ్‌ భన్సాలీ తెలిపారు. తాను బీజేపీ కార్యకర్తనేనని, కానీ ఏ నాయకుడిని ఇంతవరకు కలవలేదని తెలిపారు. తనకు, తన కుటుంబానికి పోలీసు రక్షణ కలి్పంచాలని కోరతానన్నారు. ‘‘అక్టోబర్‌ 1న డ్రగ్స్‌ పార్టీ గురించి సమాచారం వచ్చింది. దీన్ని ఎన్‌సీబీకి చెప్పమని నా స్నేహితుడు సూచించాడు.

ఈ పార్టీ విషయమై ఎన్‌సీబీ వద్ద స్వల్ప సమాచారమే ఉంది. మేము మరికొంత అందించాం. అక్టోబర్‌ 2న రైడ్‌ను ప్లాన్‌ చేశారు. సాక్షిగా నేను సంఘటనా స్థలంలో ఉన్నాను’’ అని మనీశ్‌ వెల్లడించారు. ఎన్‌సీబీ అధికారులతో తాను ఉన్నానని, అందుకే వీడియోల్లో ఎస్కార్ట్‌ చేస్తున్నట్లు కనిపించిందని ఇండియాటుడేకు ఆయన తెలిపారు. నవాబ్‌ మాలిక్‌ మలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను దేశం కోసం పనిచేస్తున్నామని, నౌకలో షారూఖ్‌ కొడుకున్నట్లు తమకు తెలియదని చెప్పారు.  

వారంతా సాక్షులు
తమ ఏజెన్సీపై వస్తున్న ఆరోపణలు నిరాధారాలని, గతంలో తాము చేసిన అరెస్టులకు ప్రతీకారంగా చేస్తున్నవై ఉండొచ్చని ఎన్‌సీబీ డీఐజీ జ్ఞానేశ్వర్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. తమ విచారణ చట్టబద్ధంగా, పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. రైడ్‌లో ఎన్‌సీపీ అధికారులతో పాటు గోస్వామి, భన్సాలీతో పాటు ప్రభాకర్, గోమెజ్, ఉస్మానీ, వైగాంకర్, రానే, ప్రకాశ్, ఫయాజ్, ఇబ్రహీంలు పాల్గొన్నారని, వీరంతా సాక్షులుగా వ్యవహరించారని వివరించారు. ఎన్‌సీబీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆర్యన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలుండబట్టే కోర్టు అతన్ని కస్టడీకి పంపిందని బీజేపీ ఎంఎల్‌ఏ అతుల్‌ అభిప్రాయపడ్డారు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోతే వెంటనే బెయిల్‌ వచ్చేదన్నారు. అల్లుడి అరెస్టును మనసులో ఉంచుకొని మాలిక్‌ ఆరోపణలు చేశారని విమర్శించారు.

డ్రగ్స్‌ కేసులో మరొకరి అరెస్ట్‌
ముంబైలో క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న కేసులో ఎన్‌సీబీ అధికారులు తాజాగా మరొక డ్రగ్‌ విక్రేతను అరెస్ట్‌ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముంబైలోని సబ్‌–అర్బన్‌ పోవాయ్‌లో ఈ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌సీబీఐ ముంబై జోనల్‌ అధికారులు బుధవారం వెల్లడించారు. దీంతో, బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ఖాన్‌ కొడుకుసహా మొత్తం 17 మందిని ఎన్‌సీబీ అరెస్ట్‌ చేసింది. కాగా, మంగళవారం అరెస్టయిన నలుగురు ఈవెంట్‌ ఆర్గనైజర్లు సమీర్‌ సెహగల్, మానవ్‌ సింఘాల్, భాస్కర్‌ అరోరా, గోపాల్‌ ఆనంద్‌లను 14 తేదీ దాకా ఎస్‌సీబీ కస్టడీకి పంపుతూ ముంబైలోని అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ నెర్లికర్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు.

మరోవైపు, అరెస్ట్‌ అయిన వారి కుటుంబ సభ్యులు కొందరు బుధవారం ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చారు. అరెస్ట్‌ అయిన అర్బాజ్‌ మర్చంట్‌ తండ్రి అస్లాం వారిలో ఉన్నారు. తన కుమారుడు అమాయకుడని ఆయన వ్యాఖ్యానించారు. అర్బాజ్‌కు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరఫు లాయర్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. అక్టోబర్‌ రెండో తేదీన ముంబై పోర్ట్‌ అంతర్జాతీయ టెర్మినల్‌ వద్ద ఉదయం 11.30 నుంచి రాత్రి 8.30 వరకు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని తెప్పించి, భద్రపరచాలని విన్నవించు కున్నారు. దీనిపై మీ స్పందన తెలపాలని ఎన్‌సీబీని కోర్టు ఆదేశించింది.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top