దేశంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అయితే పాత ఢిల్లీలోని ఆ ప్రాంతంలో జరిగే క్రిస్మస్ వేడుకులకు ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ క్రిస్మస్ అంటే అది కేవలం క్రైస్తవుల పండుగ మాత్రమే కాదు... మొఘల్ సంప్రదాయం, క్రైస్తవ విశ్వాసాల అద్భుత కలయిక. చక్రవర్తి అక్బర్ కాలంలో జెస్యూట్ మిషనరీల రాకతో మొదలైన ఈ వేడుకలు నేటికీ ‘ఈద్ ఎ తవల్లుద్’ పేరుతో వేడుకలు కొనసాగుతున్నాయి. మొఘల్ చక్రవర్తులు దసరాను ఏవిధంగా గౌరవించారో, జహంగీర్ తదితర పాలకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, ఆనాడే మత సామరస్యానికి పునాది వేశారు.
ఢిల్లీలోని తుర్క్‌మెన్ గేట్ -కశ్మీరీ గేట్ ప్రాంతాలు ఈ చారిత్రక వేడుకలకు ప్రధాన వేదికలు. ఇక్కడి 1836 నాటి సెయింట్ జేమ్స్ చర్చి , ఉర్దూలో ప్రార్థనలు జరిగే సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి పాత ఢిల్లీలో బహుళ సంస్కృతికి నిదర్శనాలు. కాలక్రమేణా అనేక ఆంగ్లో-ఇండియన్ కుటుంబాలు ఇక్కడి నుండి వలస వెళ్లినా క్రిస్మస్ వచ్చిందంటే చాలు ‘తుర్క్‌మెన్ గేట్’కు తమ మూలాలను వెతుక్కుంటూ రావడం ఒక ఆనవాయితీగా మారింది. ఇక్కడి క్రిస్మస్ అలంకరణలు, ఆచారాల్లో అచ్చమైన భారతీయత కనిపిస్తుంది.
చర్చిలను కేవలం స్టార్లతోనే కాకుండా, అరటి, మామిడి ఆకులతో తోరణాలు కట్టి అలంకరిస్తారు. పాశ్చాత్య కరోల్స్ (కీర్తనలు) ఇక్కడ ఉర్దూ, పంజాబీ బాణీల్లో వినిపిస్తూ ప్రత్యేక అనుభూతినిస్తాయి. క్రిస్మస్ వేళ ఇక్కడ భోజన ప్రియులకు పసందైన విందు దొరుకుతుంది. ఇక్కడి ఇళ్లలో మొఘలాయి రుచులైన బిర్యానీ, కబాబ్‌లను వండి వడ్డిస్తారు. వీటితో పాటు పలు రకాల సంప్రదాయ స్వీట్లు తయారుచేస్తారు. ఇక్కడి బేకరీలు క్రిస్మస్ కేకులతో కళకళలాడుతుంటాయి. కులమతాలకు అతీతంగా ఇక్కడివారంతా పొరుగువారితో ఖీర్ పంచుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ క్రిస్మస్ వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ‘విజయ్‌తో రాహుల్’.. సీక్రెట్ వెల్లడించిన టీవీకే నేత


