Schools Reopen 2021: స్కూళ్లు త్వరగా తెరవండి.. లేదంటే ఈ సమస్యలు తప్పవు

MPs seek reasoned view to open schools - Sakshi

పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి ప్రభావంతో గత ఏడాదిన్నర కాలంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. బడికి వెళ్లి విద్యాబద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. తోటి విద్యార్థులతో ఆటపాఠలకు దూరమయ్యారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లే నేస్తాలయ్యాయి. ఆన్‌లైన్‌లోనే పాఠాలు వింటున్నారు. అయితే, ఇలాంటి పరిణామం ఎంతమాత్రం వాంఛనీయం కాదని పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది. విద్యార్థులను నాలుగు గోడలకే పరిమితం చేయొద్దని, వీలైనంత త్వరగా పాఠశాలలు పునఃప్రారంభించాలని, వారిలో మేధోవికాసానికి బాటలు వేయాలని ప్రభుత్వానికి సూచించింది.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు వినయ్‌ పి.సహస్రబుద్ధే నేతృత్వంలో విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తన నివేదికను శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. స్కూళ్ల మూసివేత వల్ల తలెత్తే విపరిణామాలు విస్మరించలేనంత తీవ్రమైనవని తేల్చిచెప్పింది. కుటుంబాల సామాజిక జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇంటి పనుల్లో పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొంది. వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించింది. చిన్నారులు ఇళ్లకే పరిమితమై ఉంటే తల్లిదండ్రులు, వారి మధ్య ఉన్న సంబంధాలు సైతం ప్రభావితమవుతాయని వెల్లడించింది.

రెండు షిఫ్టుల్లో క్లాసులు
పాఠశాలలు ఏడాదికిపైగా మూతపడడం వల్ల చదువులు ఆగిపోవడమే కాదు, దేశంలో బాల్య వివాహాల సంఖ్య కూడా పెరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా స్కూళ్లను తెరిచే ఆలోచన చేయాలని ఉద్ఘాటించింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలల సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా పూర్తిచేసి, పాఠశాలలు తెరవొచ్చని సూచించింది. స్కూళ్లలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వెల్లడించింది. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి రెండు షిఫ్టుల్లో క్లాసులు నిర్వహించాలని తెలిపింది. పిల్లలను సెక్షన్లుగా విభజించి, రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించవచ్చని సూచించింది.

స్కూళ్లలో తరచుగా తనిఖీలు  
విద్యార్థుల నుంచి హాజరు తీసుకొనేటప్పుడు థర్మల్‌ స్క్రీనింగ్‌తోపాటు తరచుగా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు నిర్వహించాలని స్థాయీ సంఘం కోరింది. ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయాలని, పిల్లలకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్య సాయం అందించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

స్కూళ్లలో కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తరచుగా తనిఖీలు చేయాలని తెలిపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాఠశాలలను పునఃప్రారంభించారని, అక్కడ పాటిస్తున్న ఉత్తమమైన విధానాలను మన దేశంలోనూ అమలు చేయవచ్చని తెలియజేసింది.  కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల 2020 మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లను తెరిచినప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ మూసివేయాల్సి వచ్చింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top