
వీళ్లలో స్త్రీత్వమూ ఉంది
వ్యాపార ప్రకటనల్లో సరికొత్త ధోరణి
మగాళ్లలోని ఆడతనాన్నీ స్పృశిస్తున్న వైనం
ఆకట్టుకుంటున్న మోహన్‌లాల్ యాడ్
మలయాళ సినీ హీరో మోహన్‌లాల్ నటించిన కొత్త పాత్ర ఒకటి ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఆలోచన రేకెత్తిస్తోంది. అది సినిమా పాత్ర కాదు. ‘విన్స్‌మెరా’ బ్రాండ్ జ్యూయల్స్ యాడ్. ముచ్చటైన ఒక నెక్లెస్‌ను చూసి ఆగలేక, దాన్ని తన మెడలో వేసుకుని, అద్దంలో చూసుకుని మురిసిపోతున్న పురుషుడిగా మోహన్‌లాల్ అందులో నటించారు. ఊరికే మురిసిపోలేదు. స్త్రీ హృదయంతో పరవశించి నాట్య మయూరం అయ్యారు. ఆభరణాలను ధరించి మోహన్‌లాల్ మైమరిచిపోతే, ఆయన్ని చూసి నెటిజన్‌లు ముగ్ధులైపోయారు. అంతపెద్ద హీరో స్త్రీ మనోభావాలతో నటించటం విశేషమే అయినా, అలాంటి యాడ్‌ను ఒక బ్రాండ్ వాణిజ్య ప్రకటనగా విడుదల చేయటం సాహసమే.
మగవాళ్లలో ధీరత్వం ఉండాలి. స్త్రీలలో లాలిత్యం ఉండాలి. ఇదీ శతాబ్దాలుగా మన సమాజంలో వేళ్లూనుకుని ఉన్న భావన. ఇదే వ్యాపార ప్రకటనల్లోనూ ప్రతిఫలిస్తూ వస్తోంది. అందుకు తగ్గట్లే స్త్రీ, పురుషులు వేర్వేరు ఉత్పత్తులకు ప్రచారం ఇస్తూ కనిపిస్తుంటారు. ఇప్పుడీ ధోరణిలో మార్పు వస్తోంది. మార్కెట్‌లోని ప్రముఖ బ్రాండ్‌లు తమ వ్యాపార ప్రకటనల్లో పురుష ధీరత్వాల తెరల్ని మెల్లగా తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రముఖ మార్కెటింగ్ డేటా విశ్లేషణ సంస్థ ‘కాంతార్’.. ఈ మార్పు వేగంగా జరగటం లేదని, గతేడాది 450 కంటే ఎక్కువ ప్రకటనల్లో దాదాపు 94 శాతం సంప్రదాయ పురుష మూస పాత్రలే ఉన్నాయని తన తాజా నివేదికలో వెల్లడించింది.
ఒక శాతం గానే ప్రగతిశీలత..: గత ఏడాది యాడ్స్‌లో కనిపించిన పురుషాధిక్య మూసపాత్రల డేటాను విశ్లేషిస్తూ ‘ది ఇండియన్ మాస్క్యులినిటీ మేజ్’ పేరిట కాంతార్ ఈ నివేదికను విడుదల చేసింది. భారతీయ పురుషుల్లో స్వచ్ఛంగా ఇంటి బాధ్యతలను స్వీకరిస్తున్న ధోరణి కనిపిస్తున్నప్పటికీ వ్యాపార ప్రకటనలు 1 శాతం మాత్రమే ఆ ధోరణిని ప్రతిఫలిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయితే ప్రకటనదారులు కొంత ప్రగతిశీలంగా మారిన మాటను కాదనలేమని, అందుకు నిదర్శనంగా రేమండ్, ఏరియల్, తనిష్క్, గుడ్‌నైట్, విమ్ వంటి బ్రాండ్‌లు గతంలో తయారు చేసిన వ్యాపార ప్రకటనల్ని చూడవచ్చని పరిశ్రమలోని వారు అంటున్నారు.
‘పవర్’ వైపే బ్రాండ్‌ల మొగ్గు..: మార్కెట్‌లో ముఖ్యమైన బ్రాండ్లు తమ అమ్మకాలు పెంచుకోడానికి వ్యాపార ప్రకటనల్లో నేటికీ ‘స్టార్’ పవర్ పైనే ఆధారపడుతున్నాయి. ప్రేక్షకులు రణ్‌వీర్ సింగ్ లేదా విరాట్ కోహ్లీ వంటి ఇమేజ్ ఉన్న వారి పైనే మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు భిన్నంగా లక్స్ తన ప్రకటన కోసం షారుఖ్ ఖా¯Œ ను గులాబీ రేకులు ఉన్న బాత్ టబ్‌లో ఉంచటం చూస్తే.. ప్రకటనలు ఇప్పుడు పురుషత్వపు అతిశయోక్తి భావనల నుంచి దూరంగా జరిగే సాహసం చేస్తున్నాయని స్పష్టమౌతోంది. మోహన్‌లాల్‌తో విన్స్‌మెరా ప్రకటన ఇందుకు తాజా ఉదాహరణ.
సంస్కరణలకు పిలుపు
దేశంలోని ఎనిమిది నగరాల్లో 880 మంది పట్టణ భారతీయ పురుషులపై (18–45 సంవత్సరాల వయస్సు) కాంతార్ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. 12 భాషల్లో 150కి పైగా చానళ్లలో ప్రసారమైన 450కి పైగా టీవీ ప్రకటనల్ని నిశితంగా పరిశీలించింది. ప్రపంచంలోనే అది పెద్ద మార్కెట్ అయిన భారత్‌లోని బ్రాండ్‌లు తాము రూపొందించే ప్రకటనల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని కనబరచవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
⇒ భారతీయ పురుషుల్లో ధీరత్వమే కాదు.. మహిళల్లా సుతిమెత్తనితనమూ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రతి పురుషుడిలోనూ స్త్రీత్వమూ ఉంది. ఎంతోమంది మగాళ్లు ఇంటి బాధ్యతలనూ పంచుకుంటున్నారు. కానీ ప్రకటనల ప్రపంచం ఈ మార్పులకు అనుగుణంగా లేదు.
⇒ యువకులు (ముఖ్యంగా జెన్ జెడ్) భావోద్వేగాల పరంగా మునుపటి తరం కన్నా భిన్నంగా ఉన్నారు. మార్పునకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకాలం స్త్రీల బాధ్యతలు అనుకంటూ వస్తున్న పనులను తమకై తామే స్వీకరిస్తున్నారు. అయితే వ్యాపార ప్రకటనలు ఇంకా ఒకప్పటి మగధీరత్వాన్నే కీర్తిస్తూ ఉన్నాయి.
⇒ మిలీనియల్స్‌లో 41 శాతం, జెన్ జడ్ పురుషుల్లో 31 శాతం మంది వ్యాపార ప్రకటనలలోని పురుష పాత్రలు తమ మనస్తత్వానికి పూర్తి భిన్నంగా, ప్రతికూలంగా ఉన్నాయని భావిస్తున్నారు.
⇒ అదే సమయంలో, ‘నిజమైన పురుషులు ఏడవరు’ అనే మాటను 71 శాతం మంది పురుషులు అంగీకరిస్తున్నారు.
సర్వే హైలైట్స్
⇒ ప్రకటనల్లో కేవలం 6% పురుష పాత్రలు మాత్రమే స్త్రీల పట్ల గౌరవాన్ని, భావోద్వేగ సహానుభూతిని చూపించాయి.
⇒ 94% ప్రకటనల్లో సంప్రదాయ పురుష పాత్రలే ఉన్నాయి.
⇒ ప్రకటనల్లో 43 % వాయిస్ ఓవర్‌లు పురుషులవే. స్త్రీలవి 31% మాత్రమే. మిశ్రమ కథనాల వాయిస్ ఓవర్‌లలో కూడా పురుషుల ఆధిక్యమే కనిపిస్తోంది.
⇒ కేవలం 1% పురుషులు మాత్రమే ప్రకటనల్లో పిల్లల సంరక్షణ, ఇంటి పనుల్లో కనిపించారు.