గతంలో స్టార్ హీరో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా మినిమం కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత పెద్ద హీరో అయినా సరే..బలమైన కంటెంట్తో రాకపోతే ప్రేక్షకులు థియేటర్స్ వైపే వెళ్లడం లేదు. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..సినిమాకు మినిమం కలెక్షన్స్ రావడం లేదు. తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ సినిమాకు దారుణమైన పరాజయం ఎదురైంది. ఆయన నటించిన వృషభ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ డిజాస్టర్గా నిలిచింది.

దాదాపు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి మొత్తంగా రూ. 2.19 కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడికి కనీసం రెండు శాతం మాత్రం రికవరీ చేసింది. ఓవర్సీస్‌లో అయితే ఈ మూవీ 8 రోజుల్లో కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇండియాలో రూ. 1.94 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో అయితే ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. తొలి రోజు రూ. 10 లక్షలు వస్తే..నాలుగో రోజు కేవలం రూ. లక్షకు మాత్రమే పరిమితమైంది. తెలుగు వెర్షన్లో మొత్తంగా రూ. 32 లక్షలు, మలయాళంలో రూ. 1.01 కోట్లు, హిందీలో రూ. 8 లక్షలు, కన్నడ వెర్షన్ దాదాపు రూ. 4 లక్షలు మాత్రమే సాధించింది. మొత్తంగా ఈ సినిమాకు దాదాపు రూ. 65 కోట్లకు పైనే నష్టం వచ్చేలా కనిపిస్తుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలి ఫిల్మ్స్ బ్యానర్‌తోపాటు కనెక్ట్ మీడియా, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహించారు. సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.


