భారత్‌ బంద్‌కు మిశ్రమ స్పందన 

Mixed Response To The Bharat Bandh - Sakshi

రైల్, రోడ్‌ రోకోలు నిర్వహించిన రైతు సంఘాలు

స్పందన అద్భుతం: కిసాన్‌ మోర్చా

న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఉత్తర భారతంలో బంద్‌ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పలు రైళ్లు రద్దు కావడం, రహదారుల దిగ్బంధనం, ధర్నాలు కనిపించాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది. సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ బంద్‌లో  ఘర్షణలు జరగలేదు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, పశ్చిమ యూపీతో పాటు కేరళ, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో బంద్‌ ప్రభావం కనిపించింది. 40 రైతు సంఘాలతో కూడిన కిసాన్‌ సంయుక్త మోర్చా ఈ బంద్‌ను నిర్వహించింది.

తమ పిలుపునకు 23కుపైగా రాష్ట్రాల్లో అనూహ్య, చరిత్రాత్మక స్పందన లభించిందని, అవాంఛనీయ సంఘటన జరగలేదని మోర్చా తెలిపింది. రైతు ఆందోళనలు ఆరంభమై 10 నెలలు అవుతున్న వేళ తాము తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ సహకారం లభించిందని తెలిపింది. దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా ఉత్తర భారతదేశంలో బంద్‌ ప్రభావం ఎక్కువగా కనిపించింది. అనేక రైళ్లు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరిగింది. పలుప్రాంతాల్లో ధర్నాల కారణంగా భారీ ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ పరిసర నగరాలపై బంద్‌ ఎక్కువ ప్రభావం చూపింది.

పంజాబ్‌లో బంద్‌ అధిక శాతం విజయవంతమైంది. హరియాణాలోని సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్‌ రహదారులను రైతులు దిగ్బంధించారు. బంద్‌కు కాంగ్రెస్, ఆప్, ఎస్‌పీ, బీఎస్‌పీ, లెఫ్ట్‌పార్టీలు, స్వరాజ్‌ ఇండియా, ఆర్‌జేడీ మద్దతునిచ్చాయి. బంద్‌కు మద్దతు ఇవ్వమని టీఎంసీ తెలిపింది, అయితే రైతు ఆందోళనకు మద్దతిస్తామని పేర్కొంది. భారత్‌ బంద్‌తో దేశవ్యాప్తంగా 50 రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయని రైల్వే అధికారులు చెప్పారు. బంద్‌ అనంతరం అన్ని సర్వీసులను పునరుద్ధరించామన్నారు. ఢిల్లీ చుట్టుపక్కల రైల్‌రోకోలు జరిగాయని, దీంతో సుమారు 50 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

చర్చలే శరణ్యం: తికాయత్‌ 
రైతు సమస్యలకు పరిష్కారం కోర్టుల్లో దొరకదని, చర్చలే సమాధానమని రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ అభిప్రాయపడ్డారు.తమ ఆందోళనలు ఎలా ముగుస్తాయో తెలియదని, కానీ దేశీయ యువత తమతో చేతులు కలిపిందని చెప్పారు. తినే తిండిని మార్కెట్‌ వస్తువుగా మార్చకుండా ఉండడానికే తాము ఆందోళన చేస్తున్నామన్నారు. చట్టాల ఉపసంహరణతోనే ఈ ఆందోళనలు ముగుస్తాయని స్పష్టం చేశారు. చట్టాల రద్దు, వ్యవసాయ రంగ ప్రైవేటీకరణను ఆపడం, మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కూడా రైతుల ప్రధాన డిమాండన్నారు. ప్రజలకు ఒక్కరోజు ఇబ్బందులు కలిగిఉండొచ్చని, కానీ రైతుల కోసం మర్చిపోవాలని కోరారు. ఇప్పటివరకు చట్టాలకు సంబంధించి ప్రభుత్వం– రైతు సంఘాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top