
ఐదుగురు నిందితుల అరెస్ట్
కులం రంగు పులమొద్దంటూ పోలీసుల వినతి
రాయ్‌బరేలీ: రాత్రి వేళ చోరీలు జరక్కుండా గస్తీ తిరుగుతున్న గ్రామస్తులు..తామడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పకపోవడంతో, దొంగగా అనుమానించి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. తీవ్రమైన గాయాలు, రక్తస్రావం కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఉంఛాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత బుధవారం చోటుచేసుకున్న ఈ దారుణం తాజాగా వెలుగు చూ సింది.
డ్రోన్లతో సర్వే చేసి మరీ రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడే ముఠా ఒకటి సంచరిస్తోందంటూ కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో పుకార్లు వస్తున్నాయి. దీంతో, గ్రామాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరి ఏరి యాలో వారే గస్తీ ఏర్పాటు చేసుకున్నారు. బుధ వారం రాత్రి జమునాపూర్ క్రాసింగ్ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు నిలదీశారు. తమ ప్రశ్నలకు అతడిచ్చిన సమాధా నాలతో సంతృప్తి చెందని గ్రామస్తుల గుంపు అతడిపై దాడికి పాల్పడింది.
విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని ఈశ్వర్‌దాస్‌పూర్ రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లి వదిలేశారు. గురువారం ఉదయం పోలీసులు వెళ్లే సరికి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఫతేహ్‌పూర్‌కు చెందిన హరిఓం(40)అనే దళితుడిగా అతడిని గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. ఘటనపై సమాచారం అందినా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని అదనపు ఎస్‌పీ సంజీవ్ కుమార్ సిన్హా వెల్లడించారు. దారుణంలో పాలుపంచుకున్న మరికొందరిని సైతం గుర్తించి, అరెస్ట్ చేసే పనిలో ఉన్నామన్నారు.