‘95 శాతం మంది భారతీయులకు పెట్రోల్‌ అవసరమే లేదు’

UP Minister Said 95 Percent Indians Do Not Need Petrol - Sakshi

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ మినిస్టర్‌

మండిపడుతున్న జనాలు, విపక్షాలు

ఉత్తరప్రదేశ్‌: ఓ వైపు ప్రతిపక్షాలు, మేధావులు పెరుగుతున్న పెట్రో ధరల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా.. మరోవైపు అధికార పార్టీ నాయకులు అడ్డగోలు వ్యాఖ్యలు చేసి జనాలను మరంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటికో బండి అనే విధంగా మారాయి పరిస్థితులు. చిన్నాచితకా ఉద్యోగాలు చేసే వారు సైతం బండి కొంటున్నారు.

గత పదేళ్లలలో దేశంలో టూ వీలర్‌, 4 వీలర్‌ వినియోగం బాగా పెరిగింది. దాంతో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మినిస్టర్‌ దేశంలో దాదాపు 95 శాతం మంది ప్రజలకు అసలు పెట్రోల్‌తో పనే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఆవివరాలు..
(చదవండి: గెలిపిస్తే రూ.60కే లీటర్‌ పెట్రోల్‌: బీజేపీ)

ఉత్తరప్రదేశ్‌కు చెందిన మినిస్టర్‌ ఉపేంద్ర తివారి.. జలౌన్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఇంధన ధరల గురించి ప్రశ్నించగా.. ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్షాలుకు వేరే పనేంలేక ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. 2014, అంతకు ముందుతో పోలిస్తే.. ఇప్పుడు మోదీ, యోగి హయాంలో జనాల తలసరి ఆదాయం బాగా పెరిగింది’’ అని తెలిపారు.

‘‘మన సమాజంలో 95 శాతం మందికి పెట్రోల్‌ అవసరమే లేదు. కేవలం కార్లు ఉన్న 5 శాతం మందికి మాత్రమే పెట్రోల్‌ ధరల గురించి ఆందోళన. దీనిపై ప్రతిపక్షాలు రాద్దంతం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే 100 కోట్ల కోవిడ్‌ టీకాలు పంపిణీ చేసింది. కరోనా బారిన పడ్డ వారికి ఉచిత వైద్యం అందిస్తుంది. దీని గురించి ఎవరు మాట్లాడరు’’ అన్నారు. 
(చదవండి: నిరసన గళం: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై సచివాలయానికి దీదీ)

మినిస్టర్‌ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ‘‘నీ దృష్టిలో కార్లు ఉన్నవారికే మాత్రమే పెట్రోల్‌ అవసరం ఉంటుందా.. ఇతర వాహనాలు వాడే వారు నీళ్లతో బళ్లు నడుపుతారా ఏంటి’’.. ‘‘వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు మాకు తగిన శాస్తి జరుగుతుంది’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

చదవండి: మోదీకి చురక:‍ పెట్రోల్‌ ధరలపై బావమరుదుల భగ్గు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top