
అక్కడ భారీగా భూములు స్వాధీనం చేసుకుంటున్నారు
ఆ రైతులకు మద్దతుగా పోరాడు
మంత్రి ఎంబీ పాటిల్ సూచన
కర్ణాటక: ప్రముఖ నటుడు, సామాజిక అంశాలపై గళమెత్తే ప్రకాశ్‌రాజ్, కాంగ్రెస్ సర్కారు మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. దేవనహళ్లిలో పరిశ్రమలకు భూములు సేకరించడాన్ని ఖండిస్తూ రైతుల ధర్నాలో ఆయన పాల్గొనడాన్ని ఓ మంత్రి తప్పుబట్టారు. పక్క రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు ఇస్తున్నారని, భూ స్వాదీనం తప్పనిసరి అని పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన దేవనహళ్లి రైతులకు మద్దతుగా పోరాడుతున్న ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ మొత్తంలో భూముల స్వాధీనం జరుగుతోందని, అక్కడ రైతులకు మద్దతుగా పోరాడితే మంచిదని సలహా ఇచ్చారు.
ప్రకాశ్‌రాజ్ కర్ణాటకలో కంటే ఆంధ్ర, తమిళనాడులో బాగా ఫేమస్ అన్నారు. రాష్ట్రంలో హైటెక్ డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ కోసం 1200 ఎకరాల భూమి మాత్రమే స్వాదీనం చేసుకుంటుంటే, ఇదే అవసరానికి ఆంధ్రప్రదేశ్‌లో మడకశిర నుంచి పెనుకొండ వరకూ 10 వేల ఎకరాలను సేకరిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ అవసరాల పేరుతో అన్నదాతల నుంచి 45 వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని, విశాఖ పట్నంలో 95 పైసలకు ఒక ఎకరాను కట్టబెడుతున్నారని తెలిపారు. ఇవన్నీ ప్రకాశ్ రాజ్ కళ్లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. మంత్రి సవాల్‌కు ప్రకాశ్‌రాజ్ ఏమని స్పందిస్తారన్నది తేలాల్సి ఉంది.