తమిళనాడు: నాలుగేళ్లుగా ప్రేమించుకున్న ఓ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన రోజే వారి మధ్య గొడవ జరగడంతో చివరకు విడిపోవాల్సి వచ్చింది. ఉదయం పెళ్లి చేసుకున్న ఈ జంట.. సాయంత్రానికే విడిపోయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కేరళలోని పరశాలైకు చెందిన 26 ఏళ్ల యువతి తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్గా పనిచేస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కుళచ్చల్కు చెందిన రూబెన్ (31) సైనికుడిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడగా.. కొద్దిరోజుల్లోనే అది ప్రేమగా మారింది. అలా నాలుగేళ్లుగా ప్రేమించుకున్న వీరు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తొలుత యువతి కుటుంబ సభ్యులు వీరి ప్రేమ వివాహానికి అంగీకరించకపోయినా.. ఆ తర్వాత ఒప్పుకున్నారు.
ఈ క్రమంలో గత సోమవారం ఇద్దరికీ వివాహం జరిపించారు. పెళ్లి అనంతరం అదే రోజు సాయంత్రం వివాహ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. పెళ్లి ఆనందంలో రూబెన్ మద్యం సేవించి వధువు తండ్రి ఎదుట తూలుతూ కనిపించాడు. దీంతో ఆయన రూబెన్ను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవను ఆపేందుకు భార్య ప్రయత్నించగా.. రూబెన్ ఆమెపై చేయి చేసుకున్నాడు. అంతేకాకుండా ఆమె తండ్రిపైనా దాడి చేశాడు.
అనంతరం రూబెన్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో బాధితురాలు, ఆమె తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లైన రోజే భర్త ప్రవర్తనతో విసిగిపోయిన యువతి చివరకు అతడితో విడిపోవాలని నిర్ణయించుకుంది. తండ్రితో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. నాలుగేళ్ల ప్రేమ.. పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్లి.. చివరకు ఒక్కరోజులోనే విడిపోవడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ఆరు నెలల్లో నేనే కమిషనర్గా వస్తా..


