సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన భార్య అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడితే.. ఆ బాధ చెప్పడానికి మాటలుండవు. కానీ భార్యకు నివాళిగా ఆమె జ్ఞాపకాలతో  జేమ్స్ అల్వారెజ్ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో సంచలనంగా మారాయి. సంవత్సరం క్రితం గర్భంతో ఉన్న భార్యతో కలిసి మెటర్నిటీ షూట్ చేసుకున్న ప్రదేశంలోనే తన ఏడాది పాపతో ఫోటోషూట్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. పుట్టెడు దుఃఖంలో.. ఒకింత సంతోషం.. ఈ సందర్భాన్ని  గుర్తు చేస్తున్న ఈ ఫోటోలు కంట తడి పెట్టించక మానవు. 

వివరాలను పరిశీలిస్తే జేమ్స్ అల్వారెజ్, యెసేనియా అగిలార్ భార్యాభర్తలు. యెసేనియా గర్భం దాల్చింది. మరికొన్ని రోజుల్లో పుట్టబోయే బిడ్డకోసం కలలు కంటున్న తరుణంలో ఒక కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వాకింగ్ కోసం వెళ్లిన నిండు గర్భిణి యెసేనియాను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే  ప్రాణాలు కోల్పోయింది. అయితే ఇక్కడ మరో అద్భుతం జరిగింది. అత్యవసర సిజేరియన్ చేసిన వైద్యులు గర్భంలోని ఆడ శిశువును కాపాడగలిగారు. ఆ పాపే అడలిన్. అయితే తమ కలల కంట మొదటి పుట్టిన రోజు సందర్భంగా జేమ్స్ తన భార్యకు నివాళిగా ఫోటో షూట్ చేశారు. మెటర్నిటీ ఫోటోషూట్ చేసుకున్న ప్రదేశంలోనే, తల్లి ధరించినట్లుగా పింక్ దుస్తుల్లో, చిన్నారితో కలిసి అదే ఫోజులతో ఫోటోలో తీయించుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

చదవండి : హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు
‘‘అడలిన్, మీ మమ్మీ  ఇపుడు ఉండి ఉంటే చాలా సంతోషించేది. నీ మొదటి పుట్టినరోజు వేడుకకు ఎంతో సంబరపడేది’’ అంటూ జేమ్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. గులాబీ రంగు దుస్తుల్లో.. ఇక్కడే మెటర్నటీ షూట్ చేసుకున్నాం.. మళ్లీ అదే ప్లేస్‌లో.. తను లేకపోయినా.. అచ్చం అలాగే చేయడానికి ప్రయత్నించాం. నిజంగా అద్భుతంగా ఉన్నాయంటూ  జేమ్స్ తన భార్యను గుర్తు చేసుకున్నారు. అడలిన్‌కు ఉత్తమ తండ్రిగా ఉండటానికి ప్రయత్నిస్తాననీ,  తన భార్య గర్వపడేలా చేయాలనుకుంటున్నానని తెలిపారు. పింక్ దుస్తుల్లో ముద్దులొలికే చిన్నారి అద్భుత ఫోటోలు అందరినీ కదిలిస్తున్నాయి. స్వీట్ అడలిన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. స్వర్గంలో ఉన్న మీ భార్య తప్పకుండా ప్రౌడ్‌గా ఫీలవు తుందంటూ జేమ్స్‌కు నెటిజన్లు అభినందనలు తెలిపారు.

చదవండి : Mirabai Chanu: ట్రెడిషనల్ ఔట్‌ఫిట్, ట్వీట్ వైరల్

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
