ఇన్‌స్టా లైవ్‌లో హంతకుడి ఒప్పుకోలు
న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లోని ఆ కేఫ్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కానీ, ఒక్కసారిగా పేలిన తుపాకీ గుళ్లు అలజడి రేపాయి. వెల్కమ్ ప్రాంతానికి చెందిన ఫైజాన్ అలియాస్ ఫజ్జీ (24) అనే యువకుడు కేవ్‌లో ఉండగా.. తల, ఛాతీలో తూటాలు దిగి అక్కడికక్కడే కుప్పకూలాడు. తీవ్ర గాయాలైన ఫైజాన్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే హంతకుడు ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రత్యక్షమై నేరాన్ని అంగీకరించడం
సంచలనం సృష్టిస్తోంది.
ఔను.. నేనే చంపేశా..
హత్య జరిగిన కొన్ని గంటలకే నిందితుడు తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఏమాత్రం పశ్చాత్తాపం లేని ఆ గొంతు వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ‘నేనే ఫైజాన్‌ను చంపాను. నాలుగు నెలల క్రితం వాడు నన్ను అందరి ముందు చెంపదెబ్బ కొట్టాడు. ఆ అవమానాన్ని భరించలేకపోయాను.. అందుకే ఇప్పుడు వాడి ప్రాణం తీశాను. ఇందులో మా కుటుంబానికి, స్నేహితులకు సంబంధం లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత కక్ష!’.. అంటూ నిందితుడు కెమెరా ముందు ఒప్పుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అప్పు తీర్చమన్నందుకే..
హత్యకు కారణం పాత కక్ష అని నిందితుడు బుకాయిస్తున్నా, బాధితుని కుటుంబం మాత్రం మరో భయంకరమైన కోణాన్ని బయటపెట్టింది. నిందితుడు ఫైజాన్ దగ్గర రూ.40,000 అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బులు తిరిగి అడిగినందుకే పక్కా ప్లాన్‌తో చంపేశాడని మృతుని సోదరుడు సల్మాన్ ఆరోపిస్తున్నాడు. ‘వాడు కేవలం కాల్చడమే కాదు, కత్తితో కూడా పొడిచాడు. నా తమ్ముడు ప్రాణాల కోసం ఎంత పోరాడాడో ఆ గాయాలే చెబుతున్నాయి’.. అంటూ సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అక్రమ కేఫ్ సీజ్
ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. అక్రమంగా నడుస్తున్న ఆ కేఫ్‌ను వెంటనే సీజ్ చేశారు. నిందితుడు పోస్ట్ చేసిన వీడియో నిజమేనా? లేక తప్పుదోవ పట్టించే కుట్రా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


