వైరల్‌: ఏం ఫిలాస‌ఫీ బాబు.. మ‌ద్యం తాగితే క‌రోనా సోక‌దా?

Man Advices Drinking Alcohol Will Protect You From Covid-19   - Sakshi

దేశంలో క‌రోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పిలుపునిస్తుంటే.. ప‌లువురు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మ‌ద్యం సేవిస్తే క‌రోనా రాద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. ‘పైగా మేం పాటిస్తున్నాం. మీరు కూడా పాటించండి’ అంటూ  వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ వీడియోలు  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నుంచి సుర‌క్షితంగా ఉండేందుకు ప‌లువురు అశాస్త్రీయ మార్గాల్ని ఎంచుకుంటున్నారు. ఇటీవ‌ల క‌రోనా నుంచి సుర‌క్షితంగా ఉండేందుకు ఆవు పేడ‌ను ఒంటికి పూసుకోవాలన్న ఓ ఘటన హాట్ టాపిక్గా‌ మారిన విషయం తెలిసిందే. తాజాగా ‘క‌రోనా సోక‌కుండా, ఆస్ప‌త్రి పాలు కాకుండా త‌మ‌ని తాము ర‌క్షించుకోవాలంటే మ‌ద్యం సేవించాలి. గంజాయి పీల్చాలి. నేను అలాగే చేస్తున్నానంటూ ఓ పెద్దాయ‌న చెప్పిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ సింగ్ షేర్ చేశారు. ఇలాంటి వాటిని నమ్మోద్దని రూపిన్‌ సింగ్‌ కామెంట్‌ జతచేశారు.

ఈ వీడియోను వీక్షించిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఏం ఫిలాస‌ఫీరా బాబు.. మ‌ద్యం తాగితే క‌రోనా సోక‌దా’.. ఏం చెబుతున్నావో నీకు తెలుస్తుందా.. ఏ ఊర‌మ్మా మ‌న‌ది’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కానీ డాక్ట‌ర్లు మాత్రం క‌రోనా వైర‌స్ నుంచి సుర‌క్షితంగా ఉండేందుకు మాస్క్‌లు ధ‌రించ‌డం, లాక్‌డౌన్‌ నిబంధ‌న‌ల్ని పాటించాల‌ని సూచిస్తున్నారు. మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌ల‌హీన ప‌డుతుంద‌ని, ధూమపానం వ‌ల్ల ఒత్తిడి పెరిగి ఊపిరితిత్తుల వ్యవస్థపై దాడి చేస్తుంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top