
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం ‘మహాకుంభ మేళా’ను (Maha Kumbha Mela) మహా కుంభ్ కాదు.. మృత్యుకుంభ్ అని వ్యాఖ్యానించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో మమతా బెనర్జీ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై స్పందించారు. ‘కుంభమేళాకు వెళ్లి భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు.. యూపీ సర్కార్ వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసింది. సామాన్యుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.నేను మహా కుంభమేళాను గంగామాతకు గౌరవ సూచికంగా భావిస్తున్నాను. కానీ పేదలకు కనీస సదుపాయాలు లేవు. వీఐపీల కోసం మాత్రమే ఏర్పాట్లు చేశారు.
తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా అందలేదు. పోస్ట్‌మార్టం చేయకుండా మృతదేహాల్ని వారి కుటుంబాలకు అప్పగించారు. పోస్టుమార్టం చేసి, డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తేనే కదా ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా అందేది. బాధిత కుటుంబాలు ఇప్పుడు ఎక్స్ గ్రేషియా ఎలా పొందుతారు’ అని ప్రశ్నించారు. కాగా, ప్రయాగ్‌రాజ్‌లో (Prayag Raj) జనవరి 13 ప్రారంభమైన మహాకుంభ మేళా 45 రోజులపాటు అంటే ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది.