మంత్రి విశ్రాంతి ప్రకటన.. ప్రజలు కన్నీటి పర్యంతం

Malladi Krishna Rao Emotional Over Assembly Elections Contest - Sakshi

విశ్రాంతి ప్రకటనతో యానం వాసుల కన్నీళ్లు 

పోటీ చేయాల్సిందేనని పట్టు 

సాక్షి, చెన్నై: పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఉద్వేగానికి లోనయ్యారు. తాను విశ్రాంతి తీసుకోదలచినట్టు ఆయన చేసిన ప్రకటనతో యానం వాసులు కన్నీటి పర్యంతం అయ్యారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. యానం ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావు అందరికి సుపరిచితులే. కాంగ్రెస్‌కు చెందిన ఈ నేత 25 ఏళ్లుగా యానం ప్రజలతో మమేకం అయ్యారు. వరస విజయాలతో దూసుకొచ్చిన ఆయన యానం ప్రజల కోసం పదవిని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని చాటారు. ఆ దిశగా ఇటీవల తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదన్న ప్రకటన వెలువడింది. ఇందుకు తగ్గట్టుగా ఆదివారం యానం అయ్యన్‌నగర్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన మల్లాడి కృష్ణారావును రాజకీయాల్లో ఉండాల్సిందే, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని ప్రజలు కన్నీటి పర్యంతంతో విజ్ఞప్తి చేయడం విశేషం.

ప్రజలు, మద్దతుదారులు కన్నీటిపర్యంతంతో విజ్ఞప్తి చేయడంతో ఉద్వేగానికి లోనైన మల్లాడి రుమాలతో పలుమార్లు చెమరిన కళ్లను తడుచుకోవాల్సి వచ్చింది. ఆయన మాట్లాడుతూ తాను నిర్ణయం తీసుకున్నానని, తన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరూ రారని స్పష్టం చేశారు. తనకు విశ్రాంతి కావాలని, దయ చేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మనలో ఒకర్ని ఎంపిక చేసి, పుదుచ్చేరి అసెంబ్లీకి పంపుదామని పిలుపునిచ్చారు. ఆ ఒకరు ఎవరో ప్రజలు చెప్పాలని, యానం అభివృద్ధిని కాంక్షించే ఆ వ్యక్తికి సంపూర్ణ మద్దతుఇద్దామన్నారు. తాను ఎక్కడికి వెళ్లనని, ఇక్కడే ఉంటానని ప్రజలకు నచ్చచెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top