సచిన్‌ ట్వీట్‌: మహారాష్ట్ర సంచలన నిర్ణయం

Maharashtra Intelligence Probe Tweets Of Sachin Other On Farm Laws - Sakshi

సాక్షి, ముంబై : రైతు దీక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్స్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్టర్‌​ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, గాయని లతా మంగేష్కర్‌తో పాటు బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్, అజయ్‌ దేవగన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రముఖులు చేసిన ట్వీట్స్‌పై దర్యాప్తు జరుతామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించడం సంచలనం రేపుతోంది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే విధమైన ట్వీట్స్‌ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని, దీనిపై మహారాష్ట్ర ఇంటిలిజెన్స్‌ సంస్థలు దర్యాప్తు జరుపుతామని సోమవారం అనిల్‌ ప్రకటించారు. వరుస ట్వీట్స్‌ వెనుక కేంద్ర ప్రభుత్వ లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హోంమంత్రి ప్రకటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ట్వీట్స్‌ చేశారు. వీరిలో పాప్‌ సింగర్‌ రిహానే, పర్యవరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌, మియా ఖలిఫా వంటి వారు ఉన్నారు. భారత్‌లో రైతులు జరుపుతున్న ఉద్యమానికి తాము సంఘీభావం తెలుపుతున్నామని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారి మద్దతును ఖండిస్తూ సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, అక్షయ్‌కుమార్‌ వంటి వారు ట్వీట్‌ చేశారు.

భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఇతరులకులేదని, తమ దేశ సమస్యలను తాము పరిష్కరించుకోగలమని ముక్తకంఠంతో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఈ పరిణామం దేశంలో  పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేంద్రానికి మద్దతు ప్రకటించడాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఓ వర్గం వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నేతలతో సహా,  ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, రాజ్‌ ఠాక్రే సైతం ఖండించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఒత్తిడితోనే సచిన్‌, లతా మంగేష్కర్‌ వంటి వారు ఈ ట్వీట్స్‌ చేశారని పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top