డీజీపీ హెచ్చరిక.. యూనిఫాంలో ఉన్న పోలీసులు డాన్సులు చేయద్దు

Maharashtra Police Dance With Uniform On Dussehra - Sakshi

సాక్షి, ముంబై: పోలీసులు యూనిఫాంలో ఉండగా ఊరేగింపుల్లో, శుభకార్యాల్లో ఎలాంటి నృత్యాలు  చేయకూడదని రాష్ట్ర డీజీపీ రజ్‌నీశ్‌ సాఠే ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ధరించే యూనిఫాంకు ఒక విలువ ఉందని, పెళ్లి వేడుకలు, పండుగలు, పబ్బాలు, ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో నృత్యం చేస్తూ దాని విలువ దిగజార్చవద్దని హెచ్చరించారు. ‘అనేక సందర్భాలలో పోలీసులు వివిధ ఊరేగింపుల్లో డీజే పాటలపై నృత్యం చేస్తున్నట్లు వీడియోలలో కనిపిస్తోంది. కొందరు కావాలనే పోలీసులను బలవంతంగా డ్యాన్స్‌ చేయించి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

దీనివల్ల యావత్‌ పోలీసు డిపార్టుమెంట్‌కు అపకీర్తి వస్తుంది. కొందరు నిర్వాకం వల్ల మిగతా పోలీసులకు చెడ్డ పేరు వస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన గణేశ్‌ నిమజ్జనోత్సవాల్లో ముంబైసహా పుణేలో కొందరు పోలీసులు డీజే సౌండ్‌లకు ఉత్తేజితులై నృత్యం చేశారు. ఉత్సవాల్లో భక్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా సినిమా పాటలకు నృత్యం చేస్తే శాంతి, భద్రతలు ఎలా అదుపులో ఉంటాయనే అంశం తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువ చేస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా కూడా కొందరు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. దీంతో పోలీసు శాఖను అన్ని రంగాలవారు లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రజ్‌నీశ్‌ సాఠే ఇక ముందు ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులు డ్యాన్స్‌లు చేయవద్దని హెచ్చరించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో అధికారికంగా జారీ చేయనున్నట్లు తెలిపారు. పోలీసులు కచ్చితంగా నియమాలను పాటించాలని, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు. ఒకవేళ సామాజిక కార్యక్రమాలకు హాజరు కావాల్సి వస్తే వ్యక్తిగతంగా యూనిఫాం లేకుండా వెళ్లాలని సూచించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top